తమిళనాడు సీర్కాళి సమీపంలో తన అక్కలను స్కూలుకు పంపేందుకు తల్లితో కలిసి వచ్చిన ఒకటిన్నర ఏళ్ల చిన్నారి ‘మగిళ్వేలన్’, స్కూల్ వ్యాన్ వెనుక చక్రాల కింద పడి అక్కడికక్కడే మరణించాడు.
పుత్తూరు ఆనందకూతన్ గ్రామానికి చెందిన బాలాజీ – అరసి దంపతుల కుమార్తెలను వ్యాన్ ఎక్కించే తొందరలో, తల్లి చిన్నారిని కింద దించింది. ఆ కొన్ని సెకన్ల వ్యవధిలో పాప వ్యాన్ వెనుక వైపు వెళ్లడాన్ని గమనించని డ్రైవర్ ప్రకాష్, వాహనాన్ని అజాగ్రత్తగా ముందుకు తీయడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న కొళ్లిడం పోలీసులు, చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. వ్యాన్ డ్రైవర్ ప్రకాష్‌ను అరెస్టు చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే, స్కూల్ వ్యాన్‌లో సహాయకుడు (Helper) లేకుండా అజాగ్రత్తగా వాహనాన్ని నడిపించిన స్కూలు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, స్కూల్ కరస్పాండెంట్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబీకులు, గ్రామస్థులు నిరసన చేపట్టారు.
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, స్కూల్ వాహనాల భద్రతను నిర్ధారించాలని కోరుతూ ప్రజలు సీర్కాళి – చిదంబరం జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. దీనివల్ల సుమారు 1 కిలోమీటర్ దూరం వరకు వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చర్చలు జరపగా, యాజమాన్యాన్ని అరెస్టు చేసే వరకు వెనక్కి తగ్గేది లేదని ప్రజలు భీష్మించుకు కూర్చోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
