“ఇంట్లో ఒంటరిగా ఉన్నారా”.. అమార్యాదగా ప్రవర్తించిన డెలివరీ బాయ్! గట్టిగా బుద్ధి చెప్పి ఉద్యోగం ఊడగొట్టిన మహిళ – వైరల్ వీడియో!!

మానవత్వానికి అవమానం: దాహమని నీళ్లు అడిగిన డెలివరీ బాయ్, నీళ్లిచ్చిన మహిళతోనే అసభ్యంగా ప్రవర్తించిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

ఆన్‌లైన్ గ్రాసరీ డెలివరీ సంస్థ ‘బ్లింకిట్’ (Blinkit) డెలివరీ బాయ్ ఒక మహిళా కస్టమర్‌తో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఇంటర్నెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘సియా స్పీక్స్’ అనే ఖాతా కలిగిన సదరు మహిళ, తనకు జరిగిన చేదు అనుభవాన్ని వీడియో ద్వారా పంచుకున్నారు. “ఈరోజు నా వల్ల ఒకడి ఉద్యోగం పోయింది, వాడు దానికి పూర్తిగా అర్హుడే” అనే క్యాప్షన్‌తో ఆమె పెట్టిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఆ మహిళ వివరించిన వివరాల ప్రకారం, బ్లింకిట్ ద్వారా వచ్చిన ఆర్డర్‌ను డెలివరీ చేసేందుకు ఆ యువకుడు ఆమె ఇంటికి వచ్చాడు. ఎండ తీవ్రతను చూసి, మానవతా దృక్పథంతో ఆమె అతనికి తాగడానికి నీళ్లు ఇచ్చింది. కానీ, నీళ్లు తాగిన తర్వాత ఆ డెలివరీ బాయ్ ప్రవర్తన మారింది. ఇంటిని వింతగా పరిశీలిస్తూ, “మీరు ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారా?” అని అడిగి ఆమెను షాక్‌కు గురిచేశాడు.

అంతటితో ఆగకుండా, ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఐడిని అడుగుతూ, అనుమతి లేకుండా ఆమెకు చాలా దగ్గరగా వచ్చి అసభ్యంగా ప్రవర్తించే ప్రయత్నం చేశాడు. ప్రమాదాన్ని పసిగట్టిన సదరు మహిళ, ఏమాత్రం భయపడకుండా వెంటనే స్పందించి అతని చెంపపై బలంగా కొట్టింది. ఒక్కసారిగా మహిళా ప్రతిఘటనతో కంగారుపడిన ఆ యువకుడు అక్కడి నుండి పారిపోయాడు.

ఈ ఘటనపై ఆమె వెంటనే బ్లింకిట్ కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన బ్లింకిట్ సంస్థ, సదరు డెలివరీ బాయ్‌ను వెంటనే బ్లాక్ చేసి, ఉద్యోగం నుండి తొలగించింది. ప్రమాదకరమైన పరిస్థితుల్లో మహిళలు భయపడకుండా ఎలా ధైర్యంగా ఆత్మరక్షణ చేసుకోవాలో ఈ ఘటన నిరూపించిందని, ఆ మహిళ ధైర్యాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.


Posted

in

by

Tags: