బీహార్‌లోని నలంద జిల్లా నుండి ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక వివాహిత తన భర్తను వదిలేసి, తన మరిదితో కలిసి ఏడేళ్లుగా కాపురం చేస్తోంది. అయితే, ఇప్పుడు సదరు మరిది మరో పెళ్లికి సిద్ధపడటంతో, ఆ మహిళ ఏకంగా ఎస్పీ ఆఫీసును ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.
ఏడేళ్ల సహజీవనం.. ఇప్పుడు కొత్త సమస్య: అంజూ కుమారి అనే మహిళ, ఏడేళ్ల క్రితం తన మొదటి భర్తను, కుటుంబాన్ని వదిలేసి, తన మరిదితో కలిసి ఆలయంలో పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. అప్పటి నుండి వీరిద్దరూ భార్యాభర్తల్లాగే ఉంటున్నారు. ఈ క్రమంలో, తనకు తెలియకుండా సదరు యువకుడు వేరే పెళ్లికి సిద్ధమవుతున్నాడని, ఇప్పటికే నిశ్చితార్థం కూడా జరిగిందని అంజూ ఆరోపించింది.
చట్టపరమైన చిక్కులు: అయితే, ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే.. అంజూ కుమారి తన మొదటి భర్తకు చట్టబద్ధంగా విడాకులు ఇవ్వలేదు. అలాగే, మరిదితో చేసుకున్న పెళ్లికి ఎటువంటి ఆధారాలు లేవు. వారు ‘లివ్-ఇన్’ రిలేషన్షిప్లో మాత్రమే ఉంటున్నారు కాబట్టి, ఈ పెళ్లికి చట్టపరమైన గుర్తింపు లేదు. తను తన మరిదితోనే కలిసి ఉండాలని ఆ మహిళ పోలీసులను వేడుకుంటోంది.
దేవర-భాభిల మధ్య ప్రేమాయణం: అంజూ కుమారి ఫిర్యాదు ప్రకారం, పెళ్లయిన కొత్తలో మరిది ఇంటికి తరచుగా వచ్చేవాడు. ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. వారిద్దరి అక్రమ సంబంధం గురించి అంజూ మొదటి భర్తకు తెలిసినప్పుడు, అతను గొడవపడి దూరంగా వెళ్లిపోయాడు. ఆ తర్వాత అంజూ తన మరిదితో కలిసి వెళ్లిపోయింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
నమ్మించి మోసం చేశాడంటున్న బాధితురాలు: “ఏడేళ్లపాటు నాతో వైవాహిక జీవితాన్ని గడిపి, ఇప్పుడు కతిహార్‌లో ఉద్యోగం రాగానే నన్ను వదిలించుకోవాలని చూస్తున్నాడు” అని అంజూ ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు, ఈ ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అవతలి పక్షం నుండి ఎటువంటి స్పందన వస్తుందో చూడాల్సి ఉంది.
