పాకిస్థాన్‌లోని అశాంతి నెలకొన్న బలోచిస్థాన్ ప్రావిన్స్‌లో భారీ దాడి జరిగింది. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన గ్వాదర్ జిల్లా, జివాని ప్రాంతంలోని పాకిస్థాన్ కోస్ట్ గార్డ్ సైనిక స్థావరంపై ‘బలోచ్ లిబరేషన్ ఆర్మీ’ (BLA) భీకరమైన ఆత్మాహుతి దాడికి పాల్పడింది.
30 మందికి పైగా మృతి: ఈ దాడిలో పాకిస్థాన్ భద్రతా దళాలకు చెందిన 30 మందికి పైగా సైనికులు మరణించారని, పదుల సంఖ్యలో గాయపడ్డారని ఈ వేర్పాటువాద సంస్థ ప్రకటించింది. స్థానిక మీడియా సంస్థ ‘ద బలోచిస్థాన్ పోస్ట్’ ఈ విషయాన్ని వెల్లడించింది.
మజీద్ బ్రిగేడ్ పనే: శుక్రవారం సాయంత్రం 6:32 గంటలకు (స్థానిక సమయం) ఈ దాడి జరిగింది. BLAకి చెందిన అత్యంత ప్రమాదకరమైన ‘మజీద్ బ్రిగేడ్’ ఈ ఆపరేషన్‌ను చేపట్టింది. అతావుల్లా బలోచ్ అలియాస్ అజ్మల్ అనే ఆత్మాహుతి దళ సభ్యుడు, పేలుడు పదార్థాలతో నిండిన ట్రక్కును సైనిక క్యాంపు ప్రధాన ద్వారానికి బలంగా ఢీకొట్టాడు. ఆ పేలుడుతో క్యాంపు భద్రత దెబ్బతినగానే, బిఎల్ఏకు చెందిన ‘ఫతే స్క్వాడ్’ పోరాట యోధులు క్యాంపును చుట్టుముట్టి, బ్రతికున్న సైనికులపై దాడి చేశారు. ఈ దాడికి సంబంధించిన 43 సెకన్ల వీడియో క్లిప్‌ను బిఎల్ఏ మీడియా వింగ్ ‘హక్కాల్’ విడుదల చేసింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని బిఎల్ఏ ప్రతినిధి జీయంద్ బలోచ్ పేర్కొన్నారు.
పాక్ ప్రభుత్వ మౌనం: బలోచిస్థాన్‌కు ‘పూర్ణ స్వేచ్ఛ’ వచ్చే వరకు పాక్ భద్రతా దళాలపై తమ పోరాటం కొనసాగుతుందని బిఎల్ఏ హెచ్చరించింది. అయితే, ఈ భీకర దాడిపై పాకిస్థాన్ సైనిక మీడియా విభాగం (ISPR) గానీ, ప్రభుత్వం గానీ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరణాల సంఖ్యను కూడా ధృవీకరించలేదు.
