మాస్కో: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై 1,592 రోజులు గడిచినా, ఈ రక్తపాతం తగ్గడం లేదు. ఇటీవలి వారాల్లో ఇరు దేశాల మధ్య పోరు మరింత ప్రమాదకరంగా మారింది.
పుతిన్ స్వస్థలంపై దాడి: ఉక్రెయిన్ శనివారం రష్యాపై చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యంత భయంకరమైన డ్రోన్ దాడికి పాల్పడింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వస్థలమైన సెయింట్ పీటర్స్‌బర్గ్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. అక్కడ ఉన్న ఒక ముఖ్యమైన ఆయిల్ టెర్మినల్ మరియు ఫిన్లాండ్ సరిహద్దులోని రష్యన్ ఓడరేవుపై బాంబుల వర్షం కురిపించారు. చారిత్రాత్మక ‘పీటర్‌హాఫ్ ప్యాలెస్’ కాంప్లెక్స్ సమీపంలో కూడా డ్రోన్లు పడ్డాయి.
400 డ్రోన్ల బీభత్సం: శుక్రవారం సాయంత్రం నుండి ఉక్రెయిన్ దాదాపు 400 ప్రాణాంతక డ్రోన్లతో రష్యాలోని డజనుకు పైగా ప్రాంతాలను ముట్టడించింది. రాజధాని మాస్కో మరియు సెయింట్ పీటర్స్‌బర్గ్‌తో పాటు బెల్గోరోడ్, కలినిన్‌గ్రాడ్ ప్రాంతాలు దెబ్బతిన్నాయి. ఈ దాడుల వల్ల విద్యుత్, నీటి గ్రిడ్లు దెబ్బతినడంతో వేలాది మంది ప్రజలు అంధకారంలో చిక్కుకున్నారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రమైంది.
ప్రతీకార దాడి: ఉక్రెయిన్ రాజధాని కీవ్ మరియు సుమీ నగరాలపై రష్యా జరిపిన క్రూరమైన దాడుల్లో పౌరులు మరణించినందుకు ప్రతీకారంగానే, ఉక్రెయిన్ ఈ భారీ డ్రోన్ దాడికి దిగింది. మరోవైపు, తూర్పు ఉక్రెయిన్‌లోని కీలక నగరమైన ‘కొస్త్యాంతివ్కా’ను తాము స్వాధీనం చేసుకున్నామని రష్యా ప్రకటించింది. అయితే, దీన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కొట్టిపారేశారు.

Leave a Reply