రేవాడి (హర్యానా): హర్యానాలోని రేవాడి జిల్లాలో వెలుగుచూసిన ఒక దారుణ హత్యోదంతం అందరినీ విస్మయానికి గురిచేసింది. 21 ఏళ్ల మోను మృతి కేవలం ప్రమాదం లేదా ఆత్మహత్య కాదని, అది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్య అని పోలీసుల విచారణలో తేలింది.
మోను భార్య తన్ను, తన ప్రియుడు సోను మరియు అతని స్నేహితులతో కలిసి ఈ హత్యకు కుట్ర పన్నింది. ఈ ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు పక్కాగా ప్లాన్ చేశారు.
నీటిలో మునిగి చనిపోయినట్లుగా చిత్రీకరణ: నిందితులు ముందుగా మోను ముక్కు, నోరు మూసి స్పృహ తప్పేలా చేశారు. ఆ తర్వాత అతడిని బ్రతికుండగానే కాలువలో పడేశారు. పోస్ట్‌మార్టం రిపోర్టులో కేవలం ‘నీటిలో మునిగి మరణించినట్లు’ రావాలనే ఉద్దేశంతోనే వారు ఇలా చేశారు. ఆత్మహత్యగా నమ్మించడానికి మోను స్కూటీని కాలువ ఒడ్డున ఉంచారు. మొదట్లో పోలీసులు దీనిని ప్రమాదంగానే భావించారు.
మొబైల్ డేటాతో బయటపడ్డ నిజం: మరణించిన మోను మొబైల్‌ను పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించగా, అందులోని డేటా అంతా డిలీట్ అయి ఉంది. కుటుంబ సభ్యులు సైబర్ నిపుణుల సాయంతో ఆ డేటాను రికవర్ చేశారు. అందులో ఉన్న వాట్సాప్ చాట్స్, కాల్ వివరాల ప్రకారం.. మోను అదృశ్యమైన రోజున తన భార్య తన్నుకు 49 సార్లు ఫోన్ చేసినట్లు, కానీ వారిద్దరి మధ్య కేవలం 3 నిమిషాల సంభాషణ మాత్రమే జరిగిందని తేలింది.
అంతిమ క్రియల వరకు మౌనం: నిజం తెలిసినా కుటుంబ సభ్యులు, నిందితులకు అనుమానం రాకుండా మోను అంతిమ క్రియలు పూర్తయ్యే వరకు వేచి చూశారు. ఆ తర్వాత సైబర్ డేటాతో సహా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పథకం ప్రకారం హత్య: తన భార్య తన్ను అడగడంతోనే మోను తన జీతం డబ్బులు తీసుకుని బయలుదేరాడు. తన్ను అతడిని పక్కా ప్లాన్ ప్రకారం రప్పించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఎస్పీ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం: స్థానిక పోలీసులు మొదట్లో ఈ కేసును సీరియస్‌గా తీసుకోలేదు. జూలై 2న కుటుంబ సభ్యులు ఎస్పీని కలవడంతో విచారణ వేగవంతమైంది. పోలీసుల విచారణలో తన్ను తన నేరాన్ని అంగీకరించింది. తన ప్రియుడు సోను మరియు అతని స్నేహితులు హరిఓమ్, అమన్‌లతో కలిసి మోనును కాలువలో తోసేసినట్లు ఒప్పుకుంది.
ప్రధాన నిందితుల కోసం గాలింపు: ఈ కేసులో తన్ను మరియు హరిఓమ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు సోను మరియు మరో వ్యక్తి అమన్ పరారీలో ఉన్నారు. తమ కొడుకును కోల్పోయిన తల్లిదండ్రులు, దోషులకు కఠినంగా ఉరిశిక్ష విధించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Leave a Reply