భావ్‌నగర్ (గుజరాత్): గుజరాత్ రాష్ట్రం భావ్‌నగర్ జిల్లాలోని ఒక గ్రామంలో సోమవారం తెల్లవారుజామున చూసేవారినే భయభ్రాంతులకు గురిచేసే ఒక ఘోర సంఘటన జరిగింది.
పశువుల కాపరి అయిన కాలుభాయ్ భోగాభాయ్ కామ్రా తన ఇంటి సమీపంలో ఉన్న సమయంలో, అకస్మాత్తుగా మూడు అడవి సింహాలు నివాస ప్రాంతంలోకి ప్రవేశించాయి. వాటిలో ఒక సింహం కాలుభాయ్‌పై నేరుగా దాడి చేసి కిందకు నెట్టేసింది.
ఆ సింహం కాలుభాయ్ కాలును తన దవడలతో, పదునైన గోళ్లతో ఘోరంగా నోట కరుచుకుంది. మృత్యువు అంచుల్లో ఉన్న కాలుభాయ్, భయంతో కేకలు వేసి సింహాన్ని మరింత రెచ్చగొట్టకుండా ఒక వింతైన, అత్యంత ధైర్యమైన ప్రయత్నం చేశాడు.
ప్రాణాలతో బయటపడటానికి వింత ప్రయత్నం:
సింహాన్ని శాంతింపజేయడానికి కాలుభాయ్ పెద్దగా అరువకుండా, సింహం వీపును తన చేతులతో నెమ్మదిగా, ప్రేమగా నిమురుతూ తనును వదిలేయాల్సిందిగా (మృగ భాషలో) ప్రాణభిక్ష కోరాడు.
ఈ లోపు అతని కేకలు, గొడవ గమనించి పరుగున వచ్చిన గ్రామస్థులు సింహంపైకి రాళ్లు రువ్వుతూ, కర్రలతో శబ్దాలు చేస్తూ దానిని తరిమికొట్టేందుకు ప్రయత్నించారు. జనాలు గుమిగూడి వరుసగా రాళ్లు రువ్వడం, గట్టిగా అరుస్తుండటంతో ఆ సింహం కాలుభాయ్‌ను వదిలేసి అక్కడి నుండి అడవిలోకి పారిపోయింది.
ఆసుపత్రికి తరలింపు.. స్థానికుల ఆందోళన
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కాలుభాయ్‌ను వెంటనే పలితానా (Palitana) ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
గత 20 రోజుల్లోనే ఆ ప్రాంతంలో జరిగిన 4వ సింహం దాడి ఇది కావడంతో, అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నివాస ప్రాంతాల్లోకి సింహాలు రాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
