ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్ జిల్లా, తుల్లాపూర్ ప్రాంతంలో ఒక దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం డబ్బు కోసం సొంత ఇంటి మనిషే, పసిపిల్లల్లాంటి అమ్మాయి జీవితంతో ఆడుకోవాలని చూసిన వైనం అందరినీ నివ్వెరపరిచింది.
డబ్బు ఆశ చూపి ఉచ్చులో..
తుల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన యువతిని, ఆమె సొంత పిన్ని (చిన్నాన్న భార్య) పుష్పా దేవి మరియు అదే గ్రామానికి చెందిన ఒక యువకుడు కలిసి గత కొంతకాలంగా వేధిస్తున్నారు. ఒక పని పూర్తి చేస్తే 80 లక్షల రూపాయలు వస్తాయని నమ్మబలికి ఆ యువతిని మభ్యపెట్టారు. అందులో 20 లక్షలు నేరుగా ఆ యువతికి ఇస్తామని, మిగిలిన మొత్తాన్ని తాము పంచుకుంటామని ఆశ చూపారు. ఈ విషయాన్ని ఇంట్లో ఎవరికీ చెప్పకూడదని ఆ యువతిని భయపెట్టారు.
ఒక గంట సేపు ‘అడ్జస్ట్’ అవ్వాలి!
వారి మాటలపై అనుమానం వచ్చిన ఆ యువతి, “ఏమిటి ఆ పని?” అని పిన్నిని నిలదీసింది. దానికి పుష్పా దేవి మాట్లాడుతూ.. “ఒక కారు వస్తుంది, అందులో నువ్వు పక్కనే ఉన్న ఆజంగఢ్ జిల్లాకు వెళ్లాలి. అక్కడ ఒక గంట సేపు ఉండి తిరిగి వచ్చేస్తే చాలు” అని చెప్పింది.
ఆ దారుణమైన ప్లాన్:
కేవలం ఒక గంట సమయానికి 20 లక్షలు ఇవ్వడం ఏమిటి? అసలు అక్కడ చేయాల్సిన పని ఏమిటి? అని యువతి గట్టిగా అడిగినప్పుడు, అక్కడ చేయాల్సిన అసభ్యకరమైన (అశ్లీల) పనుల గురించి పుష్పా దేవి బయటపెట్టింది. ఆ మాట విన్న యువతి ఒక్కసారిగా షాక్కు గురైంది.
పోలీసులకు ఫిర్యాదు
వెంటనే ఆ యువతి అక్కడి నుండి బయటపడి, జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు వివరించింది. కూతురు చెప్పిన మాటలు విన్న తల్లిదండ్రులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కుటుంబ సభ్యులందరూ కలిసి వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. నిందితురాలు పుష్పా దేవి మరియు ఆ యువకుడు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
