ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్‌లో కుటుంబ కలహాల కారణంగా భార్య తన భర్తను రాత్రంతా మంచానికి కట్టేసి, కత్తితో పొడిచి, కరెంట్ షాక్ ఇచ్చి చిత్రహింసలకు గురిచేసిన దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
గత ఆదివారం అర్ధరాత్రి సంజీవ్ తివారీ అనే యువకుడికి, అతని భార్యకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ గొడవ ముదిరిన క్రమంలో, ఆ మహిళ సంజీవ్ తివారీని మంచానికి బలంగా కట్టేసి, రాత్రంతా దారుణంగా కొట్టి చిత్రహింసలు పెట్టింది.
అంతేకాకుండా, ఎలక్ట్రిక్ వైర్లను ఉపయోగించి అతనికి కరెంట్ షాక్ ఇచ్చి హింసించింది. సోమవారం ఉదయం పోలీసులకు అందిన రహస్య సమాచారం మేరకు, సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో ప్రాణాలతో పోరాడుతున్న సంజీవ్‌ను రక్షించి ఆసుపత్రికి తరలించారు.
అక్కడ అతని పరిస్థితి విషమంగా ఉండటంతో, మెరుగైన చికిత్స కోసం కాన్పూర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, పోలీసులు కేసు నమోదు చేసి నిందితురాలైన భార్యను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
