అట్లాంటా: అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌లో ఈజిప్ట్ జట్టును మోసం చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రిఫరీలు మరియు వీఏఆర్ (VAR) అర్జెంటీనాకు అనుకూలంగా పనిచేస్తున్నాయని, డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాను గెలిపించేందుకు ఫిఫా పక్షపాతంతో వ్యవహరిస్తోందని అభిమానులు మండిపడుతున్నారు.
ఫిఫా ప్రపంచకప్ రౌండ్ ఆఫ్ 16లో అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌లో ఈజిప్ట్ 3-2 గోల్స్ తేడాతో ఓటమిని చవిచూసింది. 78 నిమిషాల వరకు 2-0 గోల్స్‌తో ఆధిక్యంలో ఉన్న ఈజిప్ట్, ఆఖరి నిమిషాల్లో మ్యాచ్ ఫలితాన్ని అర్జెంటీనా మార్చేయడంతో ఓడిపోయింది.
ఈ ఓటమి తర్వాత ఈజిప్ట్ కోచ్ హసన్ మాట్లాడుతూ, “మేము అన్యాయంగా ఓడిపోయాము. మాకు అన్యాయం జరిగింది. పెనాల్టీ అవకాశం నిరాకరించబడింది, అది కూడా వీఏఆర్ ద్వారా సరిచూడలేదు. మా జట్టు చేసిన రెండో గోల్‌ను రిఫరీ రద్దు చేశారు. బహుశా ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్‌ను టోర్నమెంట్‌లో ఉంచాలని లేదా మెస్సీని కొనసాగించాలని వారు కోరుకున్నారేమో!” అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మ్యాచ్‌కు ముందు నుండే ఈజిప్ట్ జట్టుకు అనేక సమస్యలు ఎదురయ్యాయి. హోటల్ నుండి బయలుదేరేటప్పుడు ఒక ఈజిప్ట్ ఆటగాడు చిన్న పిల్లవాడితో సెల్ఫీ తీసుకుంటుండగా, అక్కడ ఉన్న సెక్యూరిటీ అధికారి అడ్డుకోవడంతో కోచ్ హసన్ వారితో వాగ్వాదానికి దిగారు. మైదానంలో కూడా రిఫరీలు అర్జెంటీనాకు అనుకూలంగానే వ్యవహరించారు. ఈజిప్ట్ 1-0తో ఆధిక్యంలో ఉన్నప్పుడు, 60వ నిమిషంలో ముస్తాఫా జియో చేసిన గోల్‌ను వీఏఆర్ ద్వారా రద్దు చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది.
ఈజిప్ట్ ఆటగాడు మర్వాన్ అటియా, అర్జెంటీనా ఆటగాడు లిసాండ్రో మార్టినెస్‌ను ఫౌల్ చేశాడని వీఏఆర్ చూపింది. కానీ, ఆ ఫౌల్ మైదానం అవతలి చివరన జరిగింది. అంత దూరం ముందు జరిగిన సంఘటనను వీఏఆర్ పరిగణనలోకి తీసుకోవడం ఈజిప్ట్ వర్గాలను ఆగ్రహానికి గురిచేసింది. అదేవిధంగా, రెండో హాఫ్ అదనపు సమయంలో ఈజిప్ట్ ఆటగాడు హమ్ది ఫాతి జెర్సీని అర్జెంటీనా ఆటగాడు అలెక్సిస్ మాక్ అలిస్టర్ వెనుక నుండి లాగి పడేశాడు. నిబంధనల ప్రకారం ఈజిప్ట్‌కు పెనాల్టీ లభించాలి, కానీ రిఫరీలు పట్టించుకోలేదు. వీఏఆర్ ద్వారా కూడా తనిఖీ చేయలేదు.
మరోవైపు, ఈజిప్ట్ ఆటగాళ్లకు వరుసగా ఎల్లో కార్డులు చూపడం, రిఫరీని నిలదీసిన కోచ్ హసన్‌కు కూడా ఎల్లో కార్డ్ చూపడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అర్జెంటీనా ఆటగాళ్లు చేసిన అదే తప్పులకు ఎల్లో కార్డు కూడా చూపలేదు. దీనిపై ఈజిప్ట్ కెప్టెన్ మహ్మద్ సలా మైదానంలోనే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈజిప్ట్ ఆటగాడు ఇమాం ముఖంపై అర్జెంటీనా ఆటగాడు పంచ్ ఇచ్చినా రిఫరీ పట్టించుకోకపోవడం, ఇది ఒక ‘బిలియన్ డాలర్ల కుంభకోణం’ అని అభిమానులు అభివర్ణిస్తున్నారు.

Leave a Reply