నాసిక్: ముంబై భైతుని ప్రాంతంలో పుచ్చకాయ తిని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన ఘటన మరువకముందే, మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో మరో షాకింగ్ మరణం చోటుచేసుకుంది.
నాసిక్ జిల్లా సతానా తాలూకాకు చెందిన ఒక వృద్ధ రైతు దంపతులు, జూన్ 28న రాత్రి తమ ఇంట్లో చికెన్ భోజనం చేశారు. భోజనం చేసిన కొద్దిసేపటికే వారు పెరుగు కూడా తిన్నారని సమాచారం. ఆ తర్వాత, దంపతులకు అకస్మాత్తుగా వాంతులు, కళ్లు తిరగడం వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తాయి. వెంటనే కుటుంబ సభ్యులు వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ 68 ఏళ్ల ద్వారకాబాయి శాంతారామ్ అనే వృద్ధురాలు మృతి చెందారు. ఆమె భర్త శాంతారామ్ను మాలెగావ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. అయితే, ఆయన కూడా పది రోజుల చికిత్స తర్వాత మృతి చెందారు. దంపతులు వరుసగా మరణించడం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని, సంచలనాన్ని నింపింది.
ఈ ఘటనపై ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) అధికారులు గ్రామానికి వెళ్లి, వారు తిన్న ఆహార పదార్థాలు మరియు వంట నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, చికెన్ మరియు పెరుగును కలిపి తినడం వల్ల లేదా పాడైపోయిన పాత ఆహారం తీసుకోవడం వల్ల తీవ్రమైన ‘ఫుడ్ పాయిజనింగ్’ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.
అయితే, ఈ దంపతుల మరణానికి కారణం చికెనా, పెరుగునా లేదా వంటలో ఏదైనా విషం కలిసిందా అనేది ల్యాబ్ రిపోర్టు వచ్చాకే తెలియాల్సి ఉంది. ఈ మిస్టరీ మరణాలు జిల్లా వైద్య అధికారులకు పెద్ద సవాలుగా మారాయి.
