భాగస్వామితో బంధం దెబ్బతింటోందా? ఈ 8 చిన్న ప్రయత్నాలతో మీ బంధంలో ప్రేమను, ఆత్మీయతను తిరిగి నింపుకోండి!

హెల్తీ రిలేషన్‌షిప్ టిప్స్: ఒకప్పుడు ప్రతిరోజూ చిరునవ్వులు పంచిన బంధం, ఇప్పుడు కేవలం ఫార్మాలిటీగా మారిపోయిందా? ఉదయం, సాయంత్రం మాటలు తగ్గిపోయి, చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతున్నారా? పక్కపక్కనే ఉన్నా ఏదో దూరం అనిపిస్తుందా?

నేటి బిజీ లైఫ్ స్టైల్‌లో చాలా మంది జంటలు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పని ఒత్తిడి, ఫోన్ల వినియోగం, బాధ్యతల భారం, మనసు విప్పి మాట్లాడుకోలేకపోవడం వంటివి బంధాన్ని నెమ్మదిగా బలహీనపరుస్తాయి. అయితే, దూరం పెరిగినంత మాత్రాన బంధం ముగిసిపోయినట్లు కాదు. ఇద్దరూ కలిసి ప్రయత్నిస్తే పరిస్థితులు మారతాయి. రిలేషన్‌షిప్ కోచ్‌లు సూచించిన 8 సులభమైన మార్గాలు ఇక్కడ ఉన్నాయి:

1. మనసు విప్పి మాట్లాడుకోవడం మొదటి మెట్టు: భావాలను మనసులోనే దాచుకోవడం బంధంలో సమస్యలకు కారణమవుతుంది. “చెప్పకపోయినా అవతలి వారు అర్థం చేసుకుంటారులే” అని అనుకోవడం తప్పు. ఏదైనా బాధగా అనిపిస్తే, ప్రశాంతమైన సమయంలో కూర్చుని నేరుగా మాట్లాడండి. మొబైల్ పక్కన పెట్టి, ఒకరిపై ఒకరు దృష్టి సారించి, నిందలు వేయకుండా మీ భావాలను సరళంగా వివరించండి.

2. చెప్పడం కంటే వినడం ముఖ్యం: చాలా గొడవలు ఒకరి మాటను మరొకరు వినకపోవడం వల్లే జరుగుతాయి. అవతలి వారు చెప్పేది ఓపికగా వింటే వారిలో భరోసా పెరుగుతుంది. ఇది అపోహలను తొలగించి, బంధాన్ని సులభతరం చేస్తుంది.

3. పాత జ్ఞాపకాలను నెమరువేసుకోండి: మొదటి పరిచయం, ఆ తొలి మాటలు, కలిసి గడిపిన అందమైన క్షణాలు… ఇవన్నీ బంధానికి కొత్త శక్తిని ఇస్తాయి. పాత ఫోటోలు చూడటం లేదా మీకు ఇష్టమైన ప్రదేశానికి మళ్ళీ వెళ్లడం వల్ల, మీరు ఒకరికొకరు ఎందుకు ముఖ్యమో గుర్తుకొస్తుంది.

4. ఒకరి కోసం ఒకరు సమయం కేటాయించండి: పెద్ద పెద్ద సర్ ప్రైజుల కంటే రోజువారీ చిన్న చిన్న ప్రయత్నాలే బంధాన్ని బలంగా మారుస్తాయి. సాయంత్రం కాఫీ, చిన్న నడక (వాక్), కలిసి భోజనం చేయడం వంటివి భావోద్వేగ అనుబంధాన్ని పెంచుతాయి.

5. కొన్ని నియమాలను నిర్ణయించుకోండి: ప్రతి ఒక్కరికీ ఇష్టాయిష్టాలు వేరుగా ఉంటాయి. కాబట్టి, కోపంలో నోరు జారకూడదని, వ్యక్తిగత విషయాలను గౌరవించాలని, ఒకరిని ఒకరు తక్కువ చేసి మాట్లాడకూడదని కొన్ని ప్రాథమిక నియమాలను ఇద్దరూ కలిసి నిర్ణయించుకోండి.

6. మీ కోసం కూడా సమయం కేటాయించుకోండి: 24 గంటలు కలిసి ఉండటమే మంచి బంధం అనిపించుకోదు. మీకు నచ్చిన హాబీలను కొనసాగించడం వల్ల మీలో సానుకూల శక్తి పెరుగుతుంది. అది బంధంపై కూడా సానుకూల ప్రభావం చూపుతుంది.

7. మీలో మార్పును గమనించండి: అవతలి వారు మారాలని కోరుకునే ముందు, మీ అలవాట్లను ఒకసారి చూసుకోండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం, కోపాన్ని అదుపులో ఉంచుకోవడం, భావాలను అర్థం చేసుకోవడం వంటివి మీ బంధాన్ని మెరుగుపరుస్తాయి.

8. అవసరమైతే నిపుణుల సలహా తీసుకోండి: ఎన్ని ప్రయత్నాలు చేసినా సమస్యలు తగ్గకపోతే, రిలేషన్‌షిప్ కౌన్సెలర్ లేదా నిపుణులను సంప్రదించడం మంచిది. మూడో వ్యక్తి చెప్పే సూచనలు అపోహలను తొలగించి, బంధం విడిపోకుండా కాపాడతాయి.


Posted

in

by

Tags: