ప్రస్తుత కాలంలో సురక్షితమైన, మంచి జీతం వచ్చే కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేయడం సాహసంగా పరిగణించబడుతుంది. అటువంటి సమయంలో, ఒక యువకుడు భారీ జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేసి సొంతూరికి వెళ్ళాడు. ఇప్పుడు అక్కడి నుండే పని చేస్తూ నెలకు 1.80 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు.
ప్రస్తుతం టెక్నాలజీ నుంచి ఆటోమొబైల్ రంగం వరకు ఉద్యోగాల్లో పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో మంచి జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేయడం అంటే పిచ్చితనమని చాలామంది భావిస్తారు. 33 ఏళ్ల ఈ యువకుడు ఉద్యోగం మానేసినప్పుడు బంధువులే కాదు, కుటుంబ సభ్యులు కూడా ఇదే మాట అన్నారు. అయితే, ఇప్పుడు అదే యువకుడు తన గ్రామంలో ఉంటూ నెలకు 1.80 లక్షల రూపాయలు ఆర్జిస్తున్నాడు. తన ప్రయాణాన్ని సోషల్ మీడియా వేదికగా అతను పంచుకున్నాడు.
యువకుడి పోస్ట్ ఏంటి?
రెండు సంవత్సరాల క్రితం సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని ఈ యువకుడు ఉద్యోగానికి రాజీనామా చేసి, ఒక మార్కెటింగ్ సర్వీస్ ఏజెన్సీని స్థాపించాడు. ప్రస్తుతం తాను నెలకు 1.8 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తున్నానని ‘రెడిట్’ (Reddit) వేదికగా వెల్లడించాడు. కొత్తగా వ్యాపారం చేసేవారి కోసం అతను మూడు కీలక సూత్రాలను పంచుకున్నాడు.
కేవలం డబ్బు కోసమే ఉద్యోగం వదలలేదు!
ప్రస్తుతం జీతం కంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు కాబట్టే ఉద్యోగం వదిలేశాడని చాలామంది అనుకోవచ్చు. కానీ, తనకు నచ్చిన పనిని తన కుటుంబంతో ఉంటూ చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని అతను స్పష్టం చేశాడు. ‘ఇది నా సుఖవంతమైన జీవితం’ అని పేర్కొన్నాడు. అయితే ఇక్కడికి చేరుకోవడం సులభం కాదు. ఒకప్పుడు కార్పొరేట్ ఉద్యోగంలో రోజుకు 14 నుంచి 16 గంటలు పని చేసిన రోజులు కూడా ఉన్నాయని అతను గుర్తు చేసుకున్నాడు.
ప్రస్తుతం అతనికి ముగ్గురు పెద్ద క్లయింట్లు ఉన్నారు. ఈ ఏడాది చివరి నాటికి మరిన్ని ఒప్పందాలు చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడు. 9-to-5 ఉద్యోగ కటకటల నుంచి విముక్తి పొంది, ఇప్పుడు తన గ్రామంలోని ఇంటి నుండి వర్షాన్ని ఆస్వాదిస్తూ ‘రిమోట్ వర్క్’ చేస్తున్నట్లు అతను తెలిపాడు.
