జాతీయ గీతం, జాతీయ గానం పై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

భారత ప్రభుత్వం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) దేశ జాతీయ చిహ్నాల గౌరవం, వాటికి సంబంధించిన నిబంధనల అమలుపై కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలకులు, కేంద్ర ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖలకు కొత్త, కఠిన మార్గదర్శకాలను జారీ చేసింది.

ఈ ఆదేశాల్లో జాతీయ గానం “జనగణమన” మరియు జాతీయ గీతం “వందే మాతరం” ఆలాపన లేదా వాయిద్య ప్రదర్శనకు సంబంధించిన నిబంధనలను తప్పనిసరిగా కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది.

జూలై 9న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పంపిన అధికారిక లేఖలో నిబంధనల పూర్తి జాబితాను మరోసారి పంపించింది. ఏ సందర్భాల్లో జాతీయ గానం, జాతీయ గీతాన్ని తప్పనిసరిగా ఆలపించాలి లేదా వినిపించాలి, ఏ సందర్భాల్లో అది ఐచ్ఛికమో వివరించింది. అలాగే, ఒకే కార్యక్రమంలో రెండింటినీ ప్రదర్శించే సందర్భాల్లో అనుసరించాల్సిన విధానాన్ని కూడా స్పష్టంగా పేర్కొంది.

ముందుగా “వందే మాతరం”, ఆ తర్వాత “జనగణమన”

ఒక కార్యక్రమంలో జాతీయ గీతం (వందే మాతరం) మరియు జాతీయ గానం (జనగణమన) రెండింటినీ కలిసి ప్రదర్శించినప్పుడు, ముందుగా వందే మాతరం, ఆ తర్వాత జనగణమన ఆలపించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

అలాగే, తమకంటూ ప్రత్యేక రాష్ట్ర గీతం (State Song) ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇదే క్రమాన్ని పాటించాలని తెలిపింది. రాష్ట్ర గీతాన్ని కూడా ప్రదర్శించే కార్యక్రమాల్లో, జాతీయ గీతం–జాతీయ గానం వరుసలో ఎలాంటి మార్పు ఉండకూడదని, ముందుగా వందే మాతరం, తరువాత జనగణమన ఉండాలని సూచించింది.

ఉచ్చారణలో పొరపాట్లు కూడా సహించరు

ఈ మార్గదర్శకాల్లో మరో ముఖ్యమైన అంశం సరైన ఉచ్చారణ. జాతీయ గానం, జాతీయ గీతాన్ని ఆలపించే సమయంలో వాటి పదాలు, లయ, ఉచ్చారణ పూర్తిగా సరిగ్గా ఉండాలని హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇందులో ఎలాంటి నిర్లక్ష్యాన్నీ సహించబోమని పేర్కొంది.

ప్రజలు, విద్యాసంస్థలు, ఇతర సంస్థల సౌకర్యార్థం జాతీయ గానం, జాతీయ గీతం యొక్క అధికారిక పదాలు మరియు సరైన ఉచ్చారణ వివరాలను హోం మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అలాగే, ఈ మార్గదర్శకాలను అన్ని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ శాఖలు, ఇతర సంస్థలకు పంపించి కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధిత శాఖలను ఆదేశించింది.


Posted

in

by

Tags: