‘ఏ తల్లికీ ఈ కష్టం రాకూడదు’: కూతురిని కోల్పోయి తల్లడిల్లుతున్న తల్లి ఆవేదన

ముంబైలోని ఖార్‌ హిందుజా ఆసుపత్రిలో, తన 14 ఏళ్ల కుమార్తె ఆరిక శ్రీవాస్తవ ‘బ్రెయిన్ డెడ్’ అయ్యిందని డాక్టర్లు చెప్పిన రోజు.. ఆరిక తల్లి బినాల్‌కు తన జీవితంలోనే అత్యంత విషాదకరమైన రోజైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ తల్లి ఒక అద్భుతం జరుగుతుందని ఎదురుచూస్తూనే ఉంది. “ఆమె బతికే అవకాశం కేవలం ఒక శాతం మాత్రమే ఉందని వైద్యులు చెప్పారు. ఆ చిన్న ఆశతోనే మేము ప్రాణం నిలుపుకున్నాం, కానీ చివరకు ఆరికను కోల్పోయాం” అని తన మలాడ్ నివాసంలో ‘హిందుస్థాన్ టైమ్స్’ ప్రతినిధితో మాట్లాడుతూ బినాల్ కన్నీటి పర్యంతమయ్యారు.

మే 10న ఆరిక తన సోదరి మనస్వి, స్నేహితురాలు హర్షిత కుమార్‌తో కలిసి ఆటోలో వెళ్తుండగా, ఒక భారీ వృక్షం ఆటోపై కూలింది. ఈ ప్రమాదంలో ఆరిక, హర్షిత తీవ్రంగా గాయపడగా, మనస్వి స్వల్ప గాయాలతో బయటపడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరిక మే 17న మరణించగా, హర్షిత ప్రస్తుతం కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో కోలుకుంటోంది.

“నా రోజులు అర్థం లేకుండా పోయాయి. ఆకలి, నిద్ర ఏమీ లేవు. ఏదో కోల్పోయిన వెలితి నన్ను వెంటాడుతోంది. నా శరీరం బతికే ఉంది కానీ, నాలో ప్రాణం లేదు” అంటూ బినాల్ తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఆరికతో ప్రతి క్షణం గడిపిన బినాల్‌కు, ఇప్పుడు ఆ ఇల్లు శూన్యంగా కనిపిస్తోంది.

ఆరికకు తన లక్ష్యంపై ఎంతో స్పష్టత ఉండేదని తల్లి చెప్పారు. “ఏడో తరగతి నుంచే ఏరోస్పేస్ ఇంజనీర్ కావాలని కలలు కనేది. ఐఐటీలో సీటు సాధించి, ఎంఐటీలో చదువుకుని, నాసాలో పనిచేయాలని ఆశపడేది. ‘ఐఐటీ సీటు సాధించడం కష్టమని అందరూ చెబుతున్నారు, కానీ నా తల్లిని గర్వపడేలా చేయడానికి నేను ఖచ్చితంగా సాధిస్తాను’ అని ఆరిక అనే మాటలు ఇంకా నా చెవుల్లో మారుమోగుతున్నాయి” అని బినాల్ గుర్తు చేసుకున్నారు.

చదువుతో పాటు ఆధ్యాత్మికత, క్రమశిక్షణ కలిగిన ఆరిక, “నేను సాధారణ జీవితాన్ని గడపాలని అనుకోవడం లేదు, ప్రపంచం గుర్తించేలా గొప్ప పేరు తెచ్చుకోవాలి” అని తరచూ చెప్పేదని బినాల్ తెలిపారు.

ఈ విషాదానికి సంబంధించిన ఒక చేదు జ్ఞాపకం ఆమెను నిరంతరం వేధిస్తోంది. ప్రమాదానికి ఒకరోజు ముందు, తన స్నేహితురాలికి క్యాన్సర్ సోకడంతో, తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి ఆరిక నిరాకరించింది. ప్రమాదం జరిగిన రోజున, ఆరిక తనతో కలిసి షాపింగ్‌కు రావాలని కోరింది. “మేమంతా బాంద్రాలో ఉన్నాము. ముందు ఆసుపత్రికి వెళ్లి వచ్చి షాపింగ్‌కు వెళ్దామని చెప్పాను. ఆ మాట వినకుండా తన సోదరితో కలిసి ఆటోలో వెళ్లింది. ప్రమాదానికి ఐదు నిమిషాల ముందు నాకు ఒక వీడియో పంపింది. ఒకవేళ నేను ఆమె మాట విని ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో” అని బినాల్ కన్నీరుమున్నీరయ్యారు.

ఎంతటి బాధలో ఉన్నా, మరో తల్లికి ఈ దుస్థితి రాకూడదనే ఉద్దేశంతో ఆమె ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. “నగర అభివృద్ధి, రోడ్ల నిర్మాణం అవసరమే. కానీ, అది మన పిల్లల ప్రాణాల కంటే ముఖ్యమా? ఇది ఒక చెట్టుకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు. వర్షాకాలంలో ఇలాంటి ప్రమాదాలు ఎన్ని జరుగుతున్నాయి? చెట్ల మొదళ్లను కాంక్రీటుతో నింపేయడం ఆపాలి. శాస్త్రీయ పద్ధతిలో వృక్షాలను సంరక్షించాలి. బాధ్యులపై చర్యలు ఉండాలి. ఏ కుటుంబం కూడా ఇలాంటి నష్టాన్ని అనుభవించకూడదు” అని ఆమె ఆవేదనతో డిమాండ్ చేశారు.


Posted

in

by

Tags: