బర్మింగ్‌హామ్: భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌ను వీక్షించేందుకు భారత క్రికెట్ దిగ్గజం ఎం.ఎస్. ధోనీ వచ్చారు. అయితే, ఆయనతో పాటు బాలీవుడ్ నటి కృతి సనన్ కూడా ఉండటం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
ప్రస్తుతం జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు 47.5 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌట్ కాగా, భారత జట్టు 34 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసి బ్యాటింగ్ కొనసాగిస్తోంది. ఈ మ్యాచ్‌ను స్వయంగా చూసేందుకు ధోనీ స్టేడియానికి వచ్చారు. ఇప్పటికే ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న ధోనీ, ఐదో టీ20ని కూడా చూశారు. తన సెలవులను అక్కడ ఆస్వాదిస్తున్న ధోనీ, తన స్నేహితులతో కలిసి మ్యాచ్‌ను వీక్షించడంపై అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు.
అసలు విషయం ఏంటి?
ధోనీతో పాటు నటి కృతి సనన్ కనిపించడంతో, వీరిద్దరి మధ్య స్నేహం ఎలా మొదలైందని అభిమానులు చర్చించుకుంటున్నారు. అయితే, కృతి సనన్ చాలా కాలంగా ధోనీ సన్నిహిత మిత్రుల సర్కిల్లో ఉన్నారని సమాచారం. ధోనీకి అత్యంత సన్నిహితుడైన కబీర్ బాహియాతో కృతి సనన్ ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ధోనీ హాజరైన అనేక పార్టీల్లో కబీర్ బాహియాతో కలిసి కృతి సనన్ కనిపించారు. ఆ ఫొటోలు గతంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయ్యాయి. అంతేకాకుండా, ధోనీ సతీమణి సాక్షి కూడా అదే స్టేడియంలో ఉన్నారని సమాచారం.
ధోనీ ఇంగ్లాండ్ పర్యటన వెనుక అసలు కారణం?
ధోనీ ఇంగ్లాండ్‌లో ఉండటానికి కేవలం విహారయాత్ర మాత్రమే కారణం కాదని, దీని వెనుక కీలకమైన అంశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘ది హండ్రెడ్’ లీగ్‌లో ఆడుతున్న జట్ల కోచ్‌లను ధోనీ కలవనున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా సీఎస్కే (CSK) జట్టుకు కొత్త కోచ్‌ను ఎంపిక చేసే బాధ్యతను ధోనీకి అప్పగించారని సమాచారం.
