ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో ప్రస్తుతం అత్యంత దారుణమైన సంక్షోభం నెలకొంది. ఒకవైపు బలూచిస్థాన్ తాము స్వతంత్ర దేశమని, పాకిస్థాన్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించుకుంది.
మరోవైపు, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో పాకిస్థాన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పరిస్థితిని అదుపు చేయలేక పాకిస్థాన్ సతమతమవుతోంది. ఇన్నాళ్లూ ఉగ్రవాదులను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేసిన పాకిస్థాన్, ఇప్పుడు అంతటా ఎదురుదెబ్బలు తింటోంది.
ఆక్రమిత కాశ్మీర్లో షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత ఒక నెలగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఆందోళనలను అణిచివేసేందుకు ప్రభుత్వం నిత్యావసర సరుకుల సరఫరాను నిలిపివేసింది. ఇది అక్కడి ప్రజలలో మరింత ఆగ్రహాన్ని కలిగించి, ఉద్యమాన్ని ఉధృతం చేసింది. ఇటీవల నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన సర్దార్ అమన్ ఖాన్, ‘PoK పాకిస్థాన్‌లో భాగం కాదు. మాకు పాకిస్థాన్ అవసరం లేదు, మాకు స్వేచ్ఛ కావాలి’ అని స్పష్టం చేశారు. అంతేకాకుండా, ‘PoK అనేది స్వతంత్ర ప్రాంతం కాదు, చర్చనీయాంశం కాదు, ఇది ఒక ఆక్రమిత ప్రాంతం’ అని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం సృష్టించాయి.
మరోవైపు, సుదీర్ఘకాలంగా స్వాతంత్ర్యం కోరుతున్న బలూచిస్థాన్‌లో కూడా పరిస్థితి చేయిదాటింది. పాకిస్థాన్ నుండి బలూచిస్థాన్ స్వతంత్రం పొందిందని రాజకీయ కార్యకర్త మీర్ యార్ బలోచ్ ప్రకటించారు. మానవ హక్కుల ఉల్లంఘనలు, రాజకీయ అణచివేతలే దీనికి కారణమని ఆయన పేర్కొన్నారు. సహజ వనరులు పుష్కలంగా ఉన్నా, పాకిస్థాన్ తమను అణచివేస్తోందని బలూచ్ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.
