విరుదునగర్ జిల్లా కల్కురిచ్చి ప్రాంతంలో వర్ష అనే యువతి నివసిస్తోంది. ఈ యువతికి, ఆమె బంధువైన యువరాజ్ అనే యువకుడికి మధ్య కొన్ని నెలల క్రితం వివాహ నిశ్చితార్థం (Engagement) జరిగింది.
ఇదిలా ఉండగా, వర్ష హఠాత్తుగా ఆ యువకుడిని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన యువరాజ్.. ఒక్కసారిగా ఆ యువతి ఇంట్లోకి చొరబడి ఆమెపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు.
తన కుమార్తెపై దాడి జరుగుతుండటం చూసి తట్టుకోలేక, ఆమెను కాపాడేందుకు తల్లి పరుగున వచ్చింది. కానీ, ఉన్మాదిలా మారిన ఆ యువకుడు.. యువతి తల్లి అయిన వినాయగ జ్యోతిని అక్కడికక్కడే కత్తితో నరికి దారుణంగా హత్య చేశాడు. ప్రస్తుతం తీవ్ర గాయాలపాలైన వర్ష ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. ఆమె తల్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
హత్య చేసిన అనంతరం అక్కడి నుంచి పారిపోయిన యువరాజ్.. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కు వెళ్లి స్వయంగా లొంగిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతుండగా, ఈ ఉదంతం ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం మరియు దిగ్భ్రాంతిని సృష్టించింది.
