బెంగళూరు ప్రభుత్వ బస్సులో సాగిన త్రిల్లర్ సీన్.. ఎవరీ మహిళ! పోలీసులకే మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్టులు

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఒక ప్రభుత్వ బస్సులో జరిగిన ఘటనే ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ మహిళ ఎవరనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు కానీ.. నడుస్తున్న బస్సులోనే ఇన్ని ట్విస్టులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం సదరు మహిళను పోలీసులు విచారిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్‌గా మారింది.

బెంగళూరు మెజెస్టిక్ నుండి కేఏ 57 ఎఫ్ 6331 (KA 57 F 6331) రిజిస్ట్రేషన్ నంబర్ గల బెంగళూరు మహానగర రవాణా సంస్థ (BMTC) బస్సు నిన్న ఉదయం ఎప్పటిలాగే బయలుదేరింది. ఆ సమయంలో బస్సులో ప్రయాణికుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. టిక్కెట్లు ఇవ్వడంలో బిజీగా ఉన్న కండక్టర్, అప్పటివరకు వసూలైన డబ్బుల బ్యాగ్‌ను డ్రైవర్ సీటు పక్కన ఉండే ఇంజిన్ బోనెట్‌పై ఉంచి, మిగిలిన ప్రయాణికులకు టిక్కెట్లు ఇచ్చేందుకు వెళ్లాడు.

ఆ సమయంలో అక్కడ నిలబడి ఉన్న ఒక మహిళ, కండక్టర్ డబ్బుల బ్యాగ్‌ను దొంగిలించి, తన బ్యాగ్‌లో దాచేసుకుంది. ఆపై ఏమీ తెలియనట్లు అక్కడే నిలబడింది. కాసేపటి తర్వాత ప్రయాణికులకు టిక్కెట్లు ఇచ్చి తిరిగి వచ్చిన కండక్టర్, తన క్యాష్ బ్యాగ్ కనిపించకపోవడంతో షాక్‌కు గురయ్యాడు. వెంటనే బస్సులోని ప్రయాణికులను విచారించగా, ఇంజిన్ పక్కన ఈ మహిళే నిలబడి ఉందని సదరు మహిళను చూపించారు.

కండక్టర్ ఆ మహిళను తన బ్యాగ్ గురించి అడగ్గా.. తనకు ఏమీ తెలియదని, తాను బ్యాగ్ తీయలేదని ఆమె ఖచ్చితంగా చెప్పేసింది. నడుస్తున్న బస్సులోనే ఇదంతా జరుగుతోంది. సహప్రయాణికులు సైతం సదరు మహిళపైనే అనుమానం వ్యక్తం చేయడంతో, ఆమెను బస్సు నుండి దిగకుండా అడ్డుకున్న కండక్టర్ మరింత నిలదీశాడు. అయితే, ఎన్నిసార్లు అడిగినా ఆ మహిళ తాను బ్యాగ్ తీయలేదని మొండికేయడంతో, వేరే దారి లేక డ్రైవర్ ఈ విషయాన్ని రోడ్డుపై ఉన్న ఒక మహిళా ట్రాఫిక్ పోలీసు అధికారికి వివరించాడు.

మహిళా ప్రయాణికురాలి ప్రాధేయపాడు: దీంతో ఆ మహిళా ట్రాఫిక్ పోలీస్ బస్సు ఎక్కి, సదరు మహిళ బ్యాగ్‌ను తనిఖీ చేసింది. అందులో కండక్టర్ క్యాష్ బ్యాగ్ ఉండటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. “కండక్టర్ బ్యాగ్ నీ బ్యాగ్‌లోకి ఎలా వచ్చింది?” అని మహిళా పోలీస్ ప్రశ్నించగా.. “ఎవరో దొంగిలించి నా బ్యాగ్‌లో పడేశారు” అంటూ ఆ మహిళ మరో అబద్ధం చెప్పింది. అంతేకాకుండా, “మా ఆయనకు ఒంట్లో బాగోలేదు, ఇంట్లో పడుకున్నారు, నేను అర్జెంట్‌గా ఇంటికి వెళ్లాలి, పిల్లలు నా కోసం వెతుకుతుంటారు.. బస్సు ఆటోమేటిక్ డోర్లు తీయండి” అంటూ పదే పదే ప్రాధేయపడటం ప్రారంభించింది.

అయినప్పటికీ మహిళా పోలీస్, కండక్టర్, డ్రైవర్ కలిసి ఆమెను వదిలిపెట్టకుండా కే.ఆర్. పురం (K.R. Puram) పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఆ మహిళను స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు.

మరో ట్విస్ట్: ఆమె వద్ద నుండి కండక్టర్ బ్యాగ్‌ను అయితే స్వాధీనం చేసుకున్నారు కానీ, ఆ బ్యాగ్‌లో ఉండాల్సిన కలెక్షన్ డబ్బులు మాయమవ్వడం చూసి పోలీసులు, కండక్టర్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆ డబ్బు ఎక్కడికి పోయిందో తెలియరాలేదు. అయితే, ఈ మహిళతో పాటు వచ్చిన మరో ముగ్గురు వ్యక్తుల గుర్తింపు వివరాలు మరియు సెల్‌ఫోన్ నంబర్లను పోలీసులు సేకరించారు. ప్రస్తుతం ఆ మహిళపై నాన్-కాగ్నిజబుల్ రిపోర్ట్ (NCR) నమోదు చేశారు. కండక్టర్ బ్యాగ్ మాత్రమే లభ్యమైన నేపథ్యంలో, డబ్బు దొంగతనంపై తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. బస్సులో జరిగిన ఈ హైడ్రామా అంతా వీడియో రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Posted

in

by

Tags: