90వ దశకంలో చిత్రసీమలో అగ్ర కథానాయికగా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న నటి రోజా.
పలువురు అగ్ర హీరోలతో కలిసి ఆమె అనేక హిట్ చిత్రాలలో నటించారు. ఆ తర్వాత రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అయితే ఆమె జీవితంలో చాలా మందికి తెలియని మరో కోణం ఉందంటూ రోజా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
దర్శకుడు ఆర్.కె. సెల్వమణితో ఉన్న ప్రేమాయణం గురించి రోజా మాట్లాడుతూ.. “మా ప్రేమ విషయం ఇంట్లో తెలిసిన వెంటనే మా నాన్నగారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. సెల్వమణి మంచి వ్యక్తి, నా కూతురిని బాగా చూసుకుంటాడనే నమ్మకం ఆయనకు ఉండేది. కానీ ఆ సమయంలో పెళ్లి చేసుకోవడానికి నా మనసు ఒప్పుకోలేదు.”
నటి రోజా ఇంటర్వ్యూ: “ఎందుకంటే నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడే మా అన్నయ్య కాలేజీ చదువు పూర్తి చేశాడు. నేను నటిస్తాననగానే నాకు తోడుగా వచ్చాడు. ఆ సమయంలో అతడు వేరే ఏ ఉద్యోగం కోసం ప్రయత్నించలేదు. ఒక అమ్మాయిని ఒంటరిగా సినిమా ఇండస్ట్రీలో తిప్పలేమని, కేవలం నా కోసమే నా వెంట ఉన్నాడు.
అలాగే మా అమ్మ కూడా నన్నే నమ్ముకుని బతికేది. అటువంటప్పుడు నేను మాత్రం పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే వారి భవిష్యత్తు ఏమవుతుందా అని ఆలోచించాను. అందుకే మొదట నా కుటుంబాన్ని ఒక మంచి స్థితికి తీసుకురావాలని నిర్ణయించుకున్నాను” అని రోజా ఎమోషనల్ అయ్యారు.
అప్పుల బాధలు: ఆమె ఇంకా మాట్లాడుతూ.. “నా కుటుంబ ఆర్థిక పరిస్థితిని కొంతవరకు స్థిరపరచాలనే ఉద్దేశంతోనే సెల్వమణితో కలిసి ‘అదిరడి పడై’ (తమిళ చిత్రం) నిర్మించాము. కానీ ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయాము. ఆ అప్పులన్నీ తీర్చి మళ్లీ నిలదొక్కుకోవడానికి మాకు 11 సంవత్సరాలు పట్టింది. అందుకే మా వివాహం 11 ఏళ్ల పాటు వాయిదా పడింది. అది దేవుడు చేసిన కుట్రా? లేక జీవితంలో మా మధ్య మరింత అవగాహన ఏర్పడాలని దేవుడు అలా చేశాడా? అనేది నాకు తెలియదు.”
విడదీయరాని ప్రేమ: “ఆ 11 ఏళ్ల కాలంలో కూడా సెల్వమణి నన్ను వదిలిపెట్టలేదు. నా మొదటి సినిమా నుండి నేటి వరకు ఆయనే నాకు కొండంత అండ. ఆ నమ్మకంతోనే మా జీవితం ఇంతవరకు సాఫీగా సాగింది” అని రోజా ఆనందంగా చెప్పారు. రోజా, సెల్వమణి ఇద్దరూ 1990ల ప్రారంభంలో వచ్చిన ‘చెంబరుత్తి’ (తెలుగులో చామంతి) సినిమా ద్వారా ప్రేమలో పడ్డారు.
ఆ తర్వాత 2002వ సంవత్సరంలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వీరికి ప్రస్తుతం అన్షుమాలిక, కృష్ణ లోహిత్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, ఈ ఇంటర్వ్యూలో రోజా సరదాగా మాట్లాడుతూ.. “ఇప్పటికీ నా భర్తతో ఏదైనా చిన్న గొడవ జరిగితే.. ‘నేను మీకు అప్పుడే 11 సంవత్సరాల టైమ్ ఇచ్చాను, అప్పుడే పారిపోకుండా ఉండిపోయి.. ఇప్పుడు ఎక్కడికీ వెళ్లలేరు, నాతోనే ఇలాగే ఉండాలి’ అని జోక్ చేస్తుంటాను” అని చెప్పుకొచ్చారు.
