ప్రజలకు రక్షణ కల్పించి, వారి సమస్యలను వినాల్సిన పోలీస్ స్టేషన్లోనే.. ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఒక మహిళపై మహిళా పోలీస్ అధికారిణి విచక్షణారహితంగా దాడి చేసిన దిగ్భ్రాంతికర సంఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది.
వారణాసిలోని చౌబేపూర్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ ఘోర సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.
వైరల్ అవుతున్న ఆ వీడియోలో, పోలీస్ స్టేషన్ లోపల ఒక మహిళా సబ్-ఇన్స్పెక్టర్, అక్కడికి ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఒక మహిళపై తీవ్ర ఆగ్రహంతో కేకలు వేస్తున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. “నీ రోజువారీ ఫిర్యాదులతో నాకు పూర్తిగా విసుగొచ్చేసింది; తెల్లవారితే చాలు నీకు ఇదే పని అయిపోయింది” అని కోపంతో అరుస్తూ, ఆ మహిళ ముఖంపై బళాబళా అంటూ పలుమార్లు చెంపదెబ్బలు కొట్టింది.
రక్షణ కోసం వచ్చిన చోట, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఒక మహిళా అధికారిణి తోటి మహిళపై ఇలా కనికరం లేకుండా దాడి చేయడం అక్కడ ఉన్నవారిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనను అక్కడ ఉన్న ఒకరు రహస్యంగా వీడియో తీసి ఇంటర్నెట్లో అప్లోడ్ చేయగా.. కొద్ది నిమిషాల్లోనే అది వైరల్గా మారి, పోలీసులకు వ్యతిరేకంగా తీవ్ర విమర్శలు రావడానికి కారణమైంది.
ఈ వీడియో ఆధారంగా, సదరు మహిళా సబ్-ఇన్స్పెక్టర్పై ప్రస్తుతం శాఖాపరమైన ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. తప్పు చేసిన అధికారిణిపై తగిన చర్యలు తీసుకుంటామని పోలీస్ వర్గాలు హామీ ఇచ్చినప్పటికీ, ప్రజల పట్ల ఇలాంటి అరాచక వైఖరిని ప్రదర్శిస్తున్న పోలీసుల ప్రవర్తన ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.
