మహారాష్ట్రలోని నాసిక్‌లో వైష్ణవి అవారే (21) అనే యువతిని, ఆమె మాజీ లివ్-ఇన్ భాగస్వామి సాహిల్ లవ్హారే (26) కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు.
ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే, నిందితుడు సాహిల్ కూడా అదే ప్రాంతంలో ఒక చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వైష్ణవి వేరొక వ్యక్తిని వివాహం చేసుకోవడానికి సిద్ధపడటమే ఈ ఘోర హత్యకు కారణమని ప్రాథమిక విచారణలో తేలింది.
మృతురాలు వైష్ణవి, నిందితుడు సాహిల్ ప్రేమించుకుని, ఒకే ఇంట్లో కలిసి నివసించేవారు (లివ్-ఇన్ రిలేషన్షిప్). అయితే, కొన్ని మనస్పర్థల కారణంగా ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత ఉద్యోగ అన్వేషణ కోసం వైష్ణవి నాసిక్ నగరానికి వచ్చి, ఇందిరానగర్‌లోని ఒక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటోంది. ఈ క్రమంలో వైష్ణవికి ఆమె తల్లిదండ్రులు వేరొక యువకుడితో వివాహం నిశ్చయించారు. ఈ విషయం సాహిల్‌కు తెలియడంతో అతడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు.
గత శుక్రవారం రాత్రి వైష్ణవిని కలిసి మాట్లాడేందుకు సాహిల్ ఆమె ఉంటున్న హాస్టల్‌కు వచ్చాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ప్రమాదాన్ని పసిగట్టిన వైష్ణవి, వెంటనే తన కాబోయే భర్తకు ఫోన్ చేసి, “సాహిల్ ఇక్కడే ఉన్నాడు, త్వరగా రా…” అని కంగారుగా చెప్పి, ఫోన్ కట్ చేయకుండా అలాగే ఉంచేసింది. ఆ సమయంలో పనిలో ఉన్న ఆ యువకుడు కంగారుపడుతూ ఘటనా స్థలానికి పరుగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చే దారిలో కూడా ఫోన్ ఆన్‌లోనే ఉండటంతో, వారిద్దరూ సుమారు 30 నిమిషాల పాటు ఘోరంగా గొడవ పడటాన్ని ఆ యువకుడు వింటూనే వచ్చాడు.
గొడవ ముదిరిన తరుణంలో, సాహిల్ తన వద్ద దాచి ఉంచిన కత్తితో వైష్ణవిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. వైష్ణవి ఆర్తనాదాలు ఫోన్లో వినబడుతుండగానే, సాహిల్ ఆ యువకుడితో “వైషూ కథ ముగిసిపోయింది” అని చెప్పి, మోటార్ సైకిల్‌పై అక్కడి నుండి పరారయ్యాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న కాబోయే భర్త, స్థానిక ప్రజలు కలిసి రక్తపు మడుగులో పడి ఉన్న వైష్ణవిని ఆసుపత్రికి తరలించారు.
అయితే, ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఇదిలా ఉండగా, శనివారం తెల్లవారుజామున అదే ప్రాంతంలోని ఒక చెట్టుకు సాహిల్ మృతదేహం ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. ఈ ఘటనపై వైష్ణవి కాబోయే భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
