సినిమా తరహా నిధి వేట! రహస్యంగా తవ్వితీసిన కోట్ల విలువైన బంగారం.. కాంట్రాక్టర్ చేసిన ఘోర మోసం.!!

రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌లోని ఒక పురాతన సాంప్రదాయ వారసత్వ భవనంలో (హవేలీ) అర్ధరాత్రి వేళ చేసిన తవ్వకాల్లో కోట్ల రూపాయల విలువైన బంగారు కలశాలు, వెండి నిధిగా లభ్యమయ్యాయనే ఫిర్యాదు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

ఈ బంగారు నిధిని ఇంటి యజమానికి తెలియకుండా రహస్యంగా నొక్కేసారనే ఆరోపణలపై.. నిర్మాణ కాంట్రాక్టర్‌పై పోలీసులు సంచలన కేసు నమోదు చేశారు.

జైపూర్‌లోని ప్రసిద్ధ త్రిపోలియా బజార్ ప్రాంతంలో కొన్ని వందల ఏళ్ల నాటి పురాతన చారిత్రాత్మక భవనం ఒకటి ఉంది. ఈ భవనాన్ని పునరుద్ధరించే (రెనోవేషన్) పనుల బాధ్యతను ఒక నిర్మాణ కాంట్రాక్టర్‌కు అప్పగించారు. అందులో భాగంగా భవనం లోపలి భాగంలో తవ్వకం పనులు జరుగుతుండగా, అకస్మాత్తుగా భూమి అడుగున ప్రాచీన కాలం నాటి నిధి దొరికినట్లు సమాచారం.

అక్కడ పనిచేసే కార్మికులు అందించిన సమాచారం ప్రకారం.. ఆ నిధిలో సుమారు 15 బంగారు కలశాలు, 45 కిలోల బరువున్న వెండి ఇటుకలు (కడ్డీలు) ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ వివరాలను ఇంటి యజమానికి తెలపలేదు. నిధి దొరికిన విషయాన్ని అత్యంత రహస్యంగా ఉంచిన కాంట్రాక్టర్, అర్ధరాత్రే ఆ నిధి మొత్తాన్ని అక్రమంగా తరలించి, వేరే చోటుకు మార్చేసాడని ఇంటి యజమాని తరఫున ఆరోపణలు వచ్చాయి.

దీనికి సంబంధించిన వీడియో ఆధారాలతో ఇంటి యజమాని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేసి ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు. పలు కోట్ల విలువైన ఈ నిధిని ఎక్కడ దాచిపెట్టారు? దీని వెనుక ఉన్న ప్రాచీన చరిత్ర ఏంటి? అనే కోణంలో పోలీసులు వీడియో ఆధారాలను నిశితంగా పరిశీలిస్తూ ఈ మిస్టరీ ముడులను విప్పడం ప్రారంభించారు.


Posted

in

by

Tags: