దేశవ్యాప్తం గా తీవ్ర సంచలనం సృష్టించిన నీట్ (NEET) పరీక్ష వివాదాల మధ్య, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌కు చెందిన ఆరియా సింగ్ అనే విద్యార్థిని తాను రాసిన రీ-ఎగ్జామ్ ఫలితాల్లోనూ భారీ అక్రమాలు జరిగాయంటూ ఆరోపించింది.
పరీక్ష ఫలితాలు వెలువడటానికి ముందు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన ఓఎంఆర్ (OMR) నకలులో ప్రశ్నల క్రమం మారిపోయింది. దీనిపై విద్యార్థిని ఆరియా సింగ్ వెంటనే ఫిర్యాదు చేయగా, దాన్ని అంగీకరించిన టెస్టింగ్ ఏజెన్సీ.. ఆ ఓఎంఆర్ కాపీని సరిచేసి మళ్లీ విడుదల చేసింది.
అయితే, అసలు సమస్య ఫలితాలు విడుదలైన రోజు రాత్రి ప్రారంభమైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన ఫైనల్ కీ ప్రకారం లెక్కించగా, విద్యార్థిని ఆరియా సింగ్‌కు 609 మార్కులు రావాలి. కానీ, ఫలితాలు విడుదలైన రోజు రాత్రి వెబ్‌సైట్‌లో ఆమెకు కేవలం 540 మార్కులు మాత్రమే చూపించారు. ఆ తర్వాత కేవలం రెండు గంటల వ్యవధిలోనే మళ్లీ లాగిన్ అయ్యి పరిశీలించగా, ఆ మార్కులు ఘోరంగా పడిపోయి కేవలం 167 గా మారడం చూసి సదరు విద్యార్థిని, ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర షాక్‌కు గురయ్యారు.
ఇది మాత్రమే కాకుండా, సవరణకు ముందు ఓఎంఆర్ షీట్ పై ఉన్న సీరియల్ నంబర్, సవరణ తర్వాత వేరే విధంగా మారిపోయిందంటూ ఆరియా సింగ్ ఒక వీడియోను విడుదల చేసి సంచలన ఆరోపణలు చేసింది. ప్రస్తుతం వెబ్‌సైట్‌లో కేవలం 167 మార్కులు మాత్రమే చూపిస్తుండటంతో తీవ్ర మానసిక వేదనకు గురవుతున్న ఆ విద్యార్థిని, ఆమె కుటుంబ సభ్యులు.. ఈ వ్యవహారంపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధానమంత్రి కార్యాలయం (PMO), కేంద్ర విద్యాశాఖ మంత్రి మరియు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారులకు ఈమెయిల్ ద్వారా ఫిర్యాదులు పంపారు.
విద్యార్థిని విడుదల చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించడంతో, ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించడం ప్రారంభించాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా, “నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దేశానికి ‘నేషనల్ షాకింగ్ ఏజెన్సీ’గా మారిపోయింది” అని మండిపడింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, “విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారూ… నీట్ రీ-ఎగ్జామ్ నిర్వహించడం కోసం మీరు వైమానిక దళాన్ని (ఎయిర్‌ఫోర్స్‌ను) ఉపయోగించి ఏర్పాటు చేసిన సిస్టమ్ ఇదేనా?” అంటూ అభ్యర్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్నారనే కోణంలో ఘాటుగా ప్రశ్నలు లేవనెత్తింది.
