గుండె జల్లుమంది! మద్యం తీసుకెళ్లడానికి వచ్చిన చోట ఇది కూడానా? సరుకు దుకాణంలోకి చొరబడి ఉద్యోగిపై దాడి చేసిన చిరుత.. వైరల్ అవుతున్న సీసీటీవీ దృశ్యాలు.!!!

రాజస్థాన్ రాష్ట్రం, టోంక్ జిల్లాలోని తోడా రాయ్‌సింగ్ ప్రాంతంలో ఉన్న ఒక మద్యం దుకాణంలోకి నిన్న సోమవారం చిరుత పులి చొరబడిన సంఘటన తీవ్ర కలకలం రేపింది.

దుకాణం బయట కూర్చుని ఉన్న ఫతే లాల్ కోలీ అనే వ్యక్తిపై మొదట దాడి చేసిన ఆ చిరుత, ఆ తర్వాత షాపులోకి చొరబడి అక్కడ విధులు నిర్వహిస్తున్న సంజయ్ గుర్జర్ అనే సేల్స్‌మ్యాన్‌పై కూడా దాడి చేసింది. అదృష్టవశాత్తూ, ఆ సేల్స్‌మ్యాన్ చిరుత బారిన పడకుండా షాపు నుండి బయటకు పరుగులు తీసి తప్పించుకున్నాడు. గాయపడిన ఇద్దరినీ వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

చిరుత మద్యం దుకాణంలోకి ప్రవేశించిన ఈ సంఘటన అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి, అందులో ఆ క్రూరమృగం మద్యం సీసాలను ధ్వంసం చేస్తూ చిందరవందర చేసిన దృశ్యాలు తీవ్ర భయాందోళనకు గురిచేసేలా ఉన్నాయి. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ మరియు పోలీసు అధికారులు, జైపూర్ జంతుప్రదర్శనశాల నుండి రప్పించిన నిపుణుల బృందంతో కలిసి తీవ్రంగా సహాయక చర్యలు చేపట్టారు. సుమారు నాలుగు నుండి ఐదు సంవత్సరాల వయస్సు ఉన్న ఆ మగ చిరుతను, కొన్ని గంటల సుదీర్ఘ పోరాటం తర్వాత మధ్యాహ్నం 1:15 గంటల సమయంలో మత్తు మందు ఇంజెక్షన్ ఇచ్చి అటవీ శాఖ అధికారులు సురక్షితంగా స్వాధీనం చేసుకున్నారు.

మద్యం దుకాణంలోకి చిరుత చొరబడిందనే విషయం తెలిసిన స్థానిక ప్రజలు, వినియోగదారులు భయాందోళనకు గురై షాపు వెలుపల భారీగా గుమిగూడటంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చిరుత దాడి చేసిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపిస్తున్నాయి. అటవీ శాఖ తగిన చర్యలు తీసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పినప్పటికీ, జనావాసాల సమీపంలోకి చిరుత వచ్చిన సంఘటన స్థానిక ప్రజలలో తీవ్ర భయాందోళనలను రేకెత్తించింది.


Posted

in

by

Tags: