ఇంట్లో బల్లి బాధ ఎక్కువైందా.? ఇక చింతే అవసరం లేదు. ఇదిగోండి సులువైన సహజ పరిష్కారాలు.!

సాధారణంగా మెజారిటీ ఇళ్లలో ఉండే అతిపెద్ద సమస్యల్లో బల్లుల బెడద ఒకటి. ఇంటి గోడలు, వంటగది మరియు వెలుతురు ఉండే ప్రాంతాల్లో పాకే బల్లులు, ఇంటిని అపరిశుభ్రం చేయడంతో పాటు చాలామందికి అసహ్యాన్ని, భయాన్ని కలిగిస్తాయి.

మార్కెట్లలో బల్లులను తారమికొట్టడానికి అనేక రసాయన పదార్థాలు విక్రయించబడుతున్నప్పటికీ, అవి ఇంట్లో ఉండే పిల్లలు మరియు పెంపుడు జంతువుల ఆరోగ్యానికి సురక్షితమైనవి కావు.

అయితే, ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా మన వంటగదిలో ఉండే పదార్థాలతోనే బల్లులను చాలా సులువుగా తారమికొట్టవచ్చు. బల్లులను తారమికొట్టడంలో ఉల్లిపాయ, వెల్లుల్లి అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలో ఉండే ఘాటైన వాసన బల్లులకు అస్సలు నచ్చదు. కాబట్టి, ఉల్లిపాయ రసం లేదా వెల్లుల్లి రసాన్ని నీటిలో కలిపి, బల్లులు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో పిచికారీ చేస్తూ ఉండవచ్చు.

అదేవిధంగా, వెల్లుల్లి రెబ్బలు లేదా ఉల్లిపాయ ముక్కలను ఇంటి మూలలు మరియు కిటికీ ప్రాంతాల్లో వేలాడదీయడం ద్వారా కూడా బల్లులు ఇంట్లోకి రాకుండా నిరోధించవచ్చు. ఇదే విధంగా, నెమలి ఈకలు మరియు గుడ్డు పెంకులు కూడా బల్లులను తారమికొట్టడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. నెమలి ఈకను చూస్తే పెద్ద పక్షి ఉందనుకుని బల్లులు భయపడి పారిపోతాయి. కాబట్టి, ఇంటి హాలు మరియు కిటికీల్లో నెమలి ఈకలను గుచ్చి ఉంచవచ్చు.

అంతేకాకుండా, ఖాళీ గుడ్డు పెంకుల వాసన బల్లులకు ఇబ్బందిని కలిగిస్తుంది కాబట్టి, వాటిని ఇంటి మూలల్లో ఉంచుతూ వచ్చినప్పుడు బల్లులు ఆ వైపే చూడవు. బల్లులు మళ్లీ ఇంట్లోకి రాకుండా నిరోధించడానికి కొన్ని ప్రాథమిక పరిశుభ్రతా అలవాట్లను పాటించడం కూడా అవసరం.

ముఖ్యంగా, ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా, అనవసరమైన కీటకాలు లేకుండా ఉంచుకోవాలి. బల్లులు కీటకాలను ఆహారంగా తీసుకోవడానికే ఇంట్లోకి వస్తాయి కాబట్టి, లైట్ల వెలుతురులో కీటకాలు చేరకుండా చూడాలి. రాత్రి వేళల్లో ఆహార వ్యర్థాలను తెరచి ఉంచకుండా మూసి ఉంచడం, కిటికీలకు నెట్లు ఏర్పాటు చేయడం బల్లుల బెడద నుండి శాశ్వత పరిష్కారాన్ని అందిస్తాయి.


Posted

in

by

Tags: