బీహార్ రాష్ట్రం సమస్తిపూర్ జిల్లా, కర్పూరీగ్రామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగియా ఖుర్ద్ గ్రామంలో ఎంతో విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది.
కాకా జిల్లాకు చెందిన అనురాధ కుమారి అనే యువతికి, అదే ప్రాంతంలోని కళాశాలలో పనిచేస్తున్న మనోహర్ కుమార్ అనే వ్యక్తికి మధ్య ఉన్న పరిచయం ప్రేమగా మారి, గత కొన్ని నెలల క్రితం వారిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు.
ఈ దంపతులు కుటుంబంతో కలిసి నివసిస్తుండగా, అనురాధకు ఇదివరకే ఎనిమిది నుండి పదేళ్లుగా పన్నాలాల్ యాదవ్ అనే వ్యక్తితో పరిచయం ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో, ఇప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలకు తండ్రి అయిన పన్నాలాల్, సంఘటన జరిగిన రోజు అర్ధరాత్రి రహస్యంగా అనురాధను కలవడానికి ఆమె ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో వారిద్దరూ కలిసి ఉండటాన్ని పొరుగున ఉన్న గ్రామస్థులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని విచారించారు.
ఈ వ్యవహారానికి సంబంధించి గ్రామంలో వెంటనే పంచాయతీ ఏర్పాటు చేసి కొన్ని గంటల పాటు తీవ్రంగా చర్చించారు. ఇందులో భర్త మనోహర్ కుమార్ పూర్తి సమ్మతిని తీసుకుని, గ్రామస్థుల సమక్షంలో ఆ మహిళకు తన పాత ప్రియుడైన పన్నాలాల్ యాదవ్‌తో ఊరి నడిబొడ్డున వివాహం జరిపించారు. ఈ విచిత్ర వివాహానికి సంబంధించిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అత్యంత వేగంగా వ్యాపిస్తూ అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి.

Leave a Reply