కర్ణాటక రాష్ట్రం బాగల్కోట్ జిల్లాలో భార్యను దారుణంగా హత్య చేసి, ఆమె ఉరికొయ్యకు వేలాడుతున్న భయంకరమైన దృశ్యాన్ని వీడియోగా తీసి బంధువులకు పంపిన క్రూరమైన భర్తను అరెస్ట్ చేసిన ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం, దిగ్భ్రాంతిని కలిగించింది.
కలాకలి గ్రామంలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు తీవ్రంగా విచారణ జరుపుతున్నారు.
హత్యకు గురైన భాగ్యశ్రీ జిగలూర్, డ్రైవర్‌గా పనిచేస్తున్న ప్రవీణ్ అశోక్ జిగలూర్లకు గత 2020 సంవత్సరంలో వివాహమైంది; వీరికి 3 ఏళ్ల మగసంతానం కూడా ఉంది. భార్యపై అనుమానం పెంచుకున్న ప్రవీణ్, గత కొన్ని నెలలుగా ఆమెతో తరచూ గొడవపడుతుండేవాడు. దీనివల్ల మనస్తాపం చెందిన భాగ్యశ్రీ గత ఒకటిన్నర నెలలుగా తన పుట్టింట్లోనే నివసిస్తోంది.
సంఘటన జరిగిన రోజున భార్య పుట్టింటికి వెళ్లిన ప్రవీణ్, ఆమెకు సర్దిచెప్పి తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో ఇద్దరూ ఒంటరిగా ఉన్నప్పుడు, భార్యపై దాడి చేసి హత్య చేసిన అతను, భాగ్యశ్రీ ఉరికొయ్యకు వేలాడుతూ నరకం అనుభవిస్తున్న దృశ్యాన్ని తన సెల్‌ఫోన్ లో వీడియోగా చిత్రీకరించాడు. అంతేకాకుండా, ఆ ఘోరమైన వీడియోను బాధితురాలి తండ్రి, కుటుంబ సభ్యులు మరియు కొందరు స్నేహితులకు కూడా పంపాడు. ఇది చూసి షాక్‌కు గురైన బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి ప్రవీణ్‌ను అరెస్ట్ చేశారు.
సంఘటనా స్థలంలో బీర్ బాటిళ్లు, ఇనుప రాడ్ వంటి వస్తువులను స్వాధీనం చేసుకున్నందున, భాగ్యశ్రీకి మ మద్యం తాగించి లేదా మత్తు మందు ఇచ్చి దారుణంగా దాడి చేసి హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. శరీరంపై గాయాలు ఉన్నందున, పోస్టుమార్టం నివేదిక మరియు ఫోరెన్సిక్ పరీక్షల తర్వాతే పూర్తి నిజం వెలుగులోకి వస్తుందని తెలిపిన పోలీసులు, అరెస్టయిన ప్రవీణ్‌ను కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు.

Leave a Reply