రాజస్థాన్ రాష్ట్రం ఝుంఝును జిల్లాలో ఆర్మీ జవాను భార్య ఉరివేసుకుని చనిపోయిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
కిటానా గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఆర్మీ జవాను టేక్‌చంద్ భార్య ప్రియాంక ఇంట్లో ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
మరణించిన ప్రియాంకకు 3 ఏళ్ల కుమారుడు, 2 నెలల పసికందు ఉన్నారు. చిన్న వయసులోనే తల్లిని కోల్పోయిన ఆ ఇద్దరు పిల్లల పరిస్థితి ఆ ప్రాంత ప్రజల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రియాంక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇదిలా ఉండగా, ప్రియాంక మృతిపై ఆమె భర్త కుటుంబ సభ్యులు, పుట్టింటి వారు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నారు. అత్తగారింటి వారు దీనిని ఆత్మహత్యగా చెబుతుండగా, ప్రియాంక పుట్టింటి వారు మాత్రం హత్య చేసి ఉరితీశారని ఆరోపిస్తున్నారు. దీంతో ఈ కేసులో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పెళ్లయినప్పటి నుంచి వరకట్నం కోసం ప్రియాంకను నిరంతరం వేధించేవారని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. రెండో బిడ్డ పుట్టిన తర్వాత కానుకలతో వెళ్లినప్పటికీ తమను అవమానించారని వారు తెలిపారు. దీంతో వరకట్న వేధింపులు, ఆత్మహత్య తదితర అన్ని కోణాల్లోనూ పోలీసులు తీవ్రంగా విచారణ జరుపుతున్నారు.

Leave a Reply