జపాన్ అంటేనే టెక్నాలజీ.. కొత్త కొత్త ఆవిష్కరణలకు మారుపేరు జపాన్ అనేది ప్రపంచమంతా తెలిసిన విషయమే..
ఇప్పుడు కొత్తగా ఒకదాన్ని కనిపెట్టింది.. వేసవి కాలం తీవ్రమైన ఎండలను, ఉక్కపోతను తట్టుకోవడానికి ఏసీ షర్టును కనిపెట్టింది.. అంటే శరీరానికే నేరుగా గాలి వీచి చల్లదనాన్ని ఇచ్చే ఏసీ షర్టును అందుబాటులోకి తెచ్చింది.. ఈ చల్లటి షర్టుకే ఇప్పుడు ప్రజల్లో భారీ ఆదరణ లభిస్తోంది.
జపాన్‌కు చెందిన ప్రముఖ దుస్తుల సంస్థ “యోఫుకు నో అయోమా”, ఫ్యాన్ దుస్తులను తయారు చేసే FZN సంస్థతో కలిసి ఈ ఆధునిక దుస్తులను రూపొందించింది. ఈ చల్లటి షర్టుకు “కూచో వేర్ షార్ట్-స్లీవ్డ్ షర్ట్” అని పేరు కూడా పెట్టారు.. ఈ షర్టు చూడటానికి మామూలు ఫార్మల్ షర్టు లాగే ఉంటుంది.
ఏసీ షర్ట్ రహస్యం
ఈ ఏసీ షర్టు వెనుక భాగంలో నడుము ప్రాంతంలో మాత్రమే చిన్నగా, తక్కువ బరువు ఉండే 2 ఫ్యాన్లు అమర్చారు. షర్టు లోపల ఉండే ఈ విసనకర్రలు బయటి గాలిని పీల్చుకుని షర్టు లోపలికి పంపుతాయి. దీని వల్ల వచ్చే గాలి, శరీరంలో పట్టే చెమటను వెంటనే ఆవిరి చేసి, శరీరాన్ని ఎప్పుడూ జిల్లుగా ఉంచడానికి సహాయపడుతుంది.
అయితే, ముందు నుండి లేదా పక్కల నుండి చూస్తే షర్టు లోపల ఇలాంటి ఫ్యాన్ ఒకటి ఉందనేదే తెలియదు.. అంత నేర్పుగా, రహస్యంగా దీనిని డిజైన్ చేశారు.. షర్టు ఉతికేటప్పుడు, అందులో అమర్చిన ఫ్యాన్ మరియు బ్యాటరీ భాగాలను మాత్రమే చాలా సులభంగా వేరు చేసి ఉతుక్కోవచ్చట.
జపాన్ అద్భుత ఆవిష్కరణ
దీనికి ముందు జపాన్‌లో భవన నిర్మాణ కార్మికులు, చెత్త నిర్వహణ సిబ్బంది మరియు భద్రతా సిబ్బంది ఇలాంటి ఎయిర్-కండిషన్డ్ దుస్తులను ఉపయోగించారు.. కానీ అవన్నీ జాకెట్ లేదా వెస్ట్ రూపంలో మాత్రమే ఉండేవి. అయితే, ఇప్పుడు మొదటిసారిగా కార్పొరేట్ మరియు ఆఫీస్ ఉద్యోగులు ఎండలో ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి వెళ్లేటప్పుడు వచ్చే చెమటను, అలసటను నివారించేలా ఈ ఫార్మల్ షర్టును తయారు చేశారు.
షర్ట్ బరువు ఎక్కువగా ఉండకూడదని, ఇందులో ఉండే ప్రతి విసనకర్ర 95 గ్రాముల బరువు, రీచార్జ్ చేసుకునే బ్యాటరీ ప్యాక్ 165 గ్రాముల బరువు మాత్రమే కలిగి ఉన్నాయి.
ఎండకు టాటా
బ్లూ కలర్, గ్రే కలర్లలో M, L, XL సైజుల్లో లభించే ఈ షర్ట్, జపాన్ కరెన్సీ ప్రకారం 17,490 యెన్ల ధరకు విక్రయించబడుతోంది. ఇందులో 2 ఫ్యాన్లు, బ్యాటరీ ప్యాక్, ఛార్జింగ్ కేబుల్ మరియు షర్ట్ అన్నీ కలిసి వస్తాయి.
ప్రస్తుతానికి వేసవి కాలంలో జపాన్‌లో ఈ ఏసీ షర్టులకు డిమాండ్ విపరీతంగా పెరిగిందట.. రాబోయే రోజుల్లో ఇతర దేశాలకు కూడా ఈ సాంకేతికత విస్తరిస్తుందని భావిస్తున్నారు.
వేడిగాలులు పెరుగుతున్న తరుణంలో, ఎండలో తిరిగే భారతీయ ఆఫీస్ ఉద్యోగులకు కూడా ఇలాంటి దుస్తులు త్వరలోనే అందుబాటులోకి వస్తే వేసవి ప్రయాణం చాలా సులువవుతుందనడంలో సందేహం లేదు…. మొత్తానికి ప్రస్తుతానికి జపాన్ చేసిన ఈ కొత్త ప్రయత్నమే ప్రపంచవ్యాప్తంగా అనేక దుస్తుల తయారీ సంస్థల దృష్టిని ఆకర్షిస్తోంది…!!

Leave a Reply