పసిఫిక్ మహాసముద్రం నడిబొడ్డున, సుమారు 10,000 జనాభాతో ఉన్న ‘తువాలు’ (Tuvalu) అనే చిన్న ద్వీప దేశం, వాతావరణ మార్పుల తీవ్రత కారణంగా రాబోయే 20 నుండి 30 సంవత్సరాలలో సముద్రంలో మునిగిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది.
వాటికన్ సిటీ తర్వాత ప్రపంచంలో అత్యల్ప జనాభా కలిగిన రెండవ దేశమైన ఇది, కేవలం 25 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన తొమ్మిది చిన్న ద్వీపాల సముదాయం.
తువాలు దేశపు భూభాగం సముద్ర మట్టానికి కేవలం 4.6 మీటర్ల ఎత్తులో మాత్రమే ఉంది. ఇక్కడ సముద్ర మట్టం సంవత్సరానికి సగటున 3.9 మిల్లీమీటర్ల వరకు పెరుగుతోంది. ఇది ప్రపంచ సగటు కంటే రెండింతలు ఎక్కువ. సముద్ర నీటి మట్టం నిరంతరం పెరుగుతుండటం వల్ల, ఈ దేశంలోని రెండు ద్వీపాలు ఇప్పటికే సముద్రంలో మునిగిపోయే ప్రమాదపు అంచున ఉన్నాయని ఆ దేశ ప్రభుత్వం తెలిపింది.
సముద్రపు నీరు భూమిలోకి చొచ్చుకు రావడం, తరచూ వచ్చే తుఫానుల కారణంగా భూగర్భ జలాలు పాడైపోయి, వ్యవసాయ భూములు కూడా తీవ్రంగా దెబ్బతింటున్నాయి. 2015లో సంభవించిన ‘పామ్’ తుఫాను ఈ దేశంలోని ఎక్కువ భాగం పంటలను నాశనం చేసి, ఇళ్లను ముంచెత్తింది. అంతేకాకుండా, సముద్రపు అలలు తరచూ విమానాశ్రయ రన్ వేను, ప్రధాన రహదారులను ముంచెత్తుతున్నాయి.
ఇక్కడ ఉన్న ఫనాఫుటి ద్వీపంలో ఉన్న ఒకే ఒక్క విమానాశ్రయ రన్ వే, సాయంత్రం వేళల్లో పిల్లలు ఫుట్బాల్ ఆడుకునే మైదానంగా కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ భూభాగం అంత తక్కువగా ఉంటుంది. చేపల వేట, విదేశీ సహాయం మరియు దేశపు ఇంటర్నెట్ డొమైన్ ‘.tv’ విక్రయాల ద్వారానే ఈ దేశ ఆర్థిక వ్యవస్థ నడుస్తోంది.
అపరిమితమైన ప్రకృతి అందాలు ఒప్పొంగే ప్రదేశమైనప్పటికీ, భౌగోళిక సవాళ్ల కారణంగా ప్రపంచంలోనే అత్యల్ప సంఖ్యలో పర్యాటకులు సందర్శించే దేశంగా తువాలు నిలిచింది. వాతావరణ మార్పుల దారుణమైన ప్రభావం వల్ల ఒక పూర్తి దేశమే ప్రపంచ పటం నుండి కనుమరుగైపోయే దయనీయ పరిస్థితి ప్రస్తుతం దాపరించింది.

Leave a Reply