పిల్లల ఎత్తు పెరగడం అనేది కేవలం అందం కి సంబంధించిన విషయం మాత్రమే కాదు; అది వారి సమగ్ర శారీరక ఆరోగ్యానికి ప్రతీక.
జన్యుపరమైన కారణాలు ఎత్తును నిర్ధారించినప్పటికీ, సరైన పోషకాహారం, తగినంత నిద్ర మరియు రోజువారీ వ్యాయామం అనేవి ఒక చిన్నారి తన గరిష్ట ఎత్తును చేరుకోవడానికి అత్యంత అవసరమని పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ టి. శ్రీకాంత్ తెలిపారు.
ఎముకలు, కండరాల పెరుగుదలకు ప్రోటీన్, కాల్షియం, విటమిన్ డి, ఐరన్ (ఇనుము) మరియు జింక్ వంటి పోషకాలు ఎంతగానో అవసరం. కాబట్టి చిన్నప్పటి నుంచే పాలు, పాల పదార్థాలు, గుడ్లు, చేపలు, పప్పుధాన్యాలు, పండ్లు మరియు కూరగాయలను పిల్లలకు తినిపించడం అలవాటు చేయాలి. జంక్ ఫుడ్స్ (త్వరిత ఆహారాలు) మరియు చక్కెర పానీయాలు ఎక్కువగా ఇవ్వడం వల్ల శరీర బరువు పెరిగి, వారి ఎత్తు పెరుగుదలకు అడ్డంకిగా మారుతుంది.
రాత్రి వేళల్లోగాఢ నిద్రలో ఉన్నప్పుడు మాత్రమే శరీరంలో గ్రోత్ హార్మోన్ (పెరుగుదల హార్మోన్) అత్యధికంగా స్రవిస్తుంది. కానీ, ప్రస్తుత కాలంలో పిల్లలు ఎక్కువ సమయం సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించడం వల్ల నిద్ర భంగమై, మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇది హార్మోన్ల స్రావాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది కాబట్టి, తల్లిదండ్రులు తమ పిల్లలు సెల్‌ఫోన్ స్క్రీన్‌లకు దూరంగా ఉంటూ, వయస్సుకు తగ్గ తగినంత నిద్రను పొందేలా చూడాలి.
చదువు, సెల్‌ఫోన్ వాడకం వల్ల పిల్లలు ఒకే చోట ఎక్కువ సమయం కూర్చోవడం శారీరక శ్రమను తగ్గించి, స్థూలకాయానికి (ఓబెసిటీ) దారితీస్తుంది. దీనిని నివారించడానికి పరుగెత్తడం, దూకడం, ఈత కొట్టడం మరియు సైకిల్ తొక్కడం వంటి క్రీడలు/వ్యాయామాల్లో వారిని భాగస్వాములను చేయాలి. ఇవి ఎముకలను, కండరాలను బలోపేతం చేసి ఆరోగ్యకరమైన ఎత్తు పెరుగుదలకు దోహదపడతాయి.
తల్లిదండ్రులు తమ పిల్లల ఎత్తు పెరుగుదలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలి. ఈడు పిల్లలతో పోల్చినప్పుడు పెరుగుదల తక్కువగా ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఎందుకంటే, ఇది కేవలం ఎత్తు లోపం మాత్రమే కాకుండా హార్మోన్ల లోపాలు, థైరాయిడ్, పోషకాహార లోపం లేదా జన్యుపరమైన వ్యాధుల లక్షణం కూడా కావచ్చు కాబట్టి ముందే గుర్తించడం చాలా అవసరం.

Leave a Reply