పంజాబ్ ఘటన మరువకముందే, తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఒక పెంపుడు కుక్క బాలుడిపై అత్యంత పాశవికంగా దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
వారణాసిలోని ప్రఖ్యాత బనారస్ హిందూ యూనివర్సిటీ (BHU) క్యాంపస్‌లో మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో, 11 ఏళ్ల బాలుడి ముఖం మరియు తలపై ఒక కుక్క విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.
అక్కడి ఆసుపత్రిలో సీనియర్ నర్సింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ప్రేమా రామ్ చౌదరి, గురువారం ఉదయం తన ఇద్దరు కుమారులతో కలిసి క్యాంపస్‌లో మార్నింగ్ వాక్కు వెళ్లారు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత చిన్న కుమారుడైన అభినవ్ (11)ను ఇంటికి తిరిగి వెళ్లమని చెప్పారు. బాలుడు ఒంటరిగా ఇంటికి వెళ్తున్న సమయంలో, ఇంటి సమీపంలోనే ఉన్న ఒక కుక్క అకస్మాత్తుగా అతనిపైకి దూకి విచక్షణారహితంగా కొరికి పీకేసింది. బాలుడి ఆర్తనాదాలు విని చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని చూసి షాక్‌కు గురయ్యారు.
కుక్క చేసిన దాడిలో అభినవ్ తల, ముఖం తీవ్రంగా ఛిద్రమయ్యాయి. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న బాలుడిని అటుగా వెళ్తున్న సంజయ్ రాయ్ మరియు అతని స్నేహితులు హుటాహుటిన స్కూటర్‌పై ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో చేరిన బాలుడికి వైద్యులు ఎమర్జెన్సీ చికిత్స అందించారు. ముఖం, తలపై లోతైన గాయాలు ఉండటంతో దాదాపు 50 కుట్లు వేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆ బాలుడు ఐసీయూ (ICU)లో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు.
ఈ ఘటనపై బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే ప్రాంతానికి చెందిన శ్రద్ధా సింగ్ అనే మహిళకు చెందిన పెంపుడు కుక్కను ఎలాంటి భద్రతా చర్యలు (నోటికి మాస్క్/బెల్ట్) లేకుండా వదిలేయడం వల్లే ఈ ఘోరం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తూ, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. యూనివర్సిటీ ప్రాంగణంలోనే ఇలాంటి దారుణం జరగడం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది.

Leave a Reply