“అయ్యో దేవుడా! ఆశపడి పానీపూరీ తింటే తప్పా?!” గబగబా 10 పానీపూరీలు లాగించేసిన మహిళ… చివరకు నోరు మూతపడక దవడ జారిపోయిన వైనం!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఔరయ్యా ప్రాంతంలో పానీపూరీ (గోల్‌గప్పా) తినేందుకు వెళ్లిన ఓ మహిళకు ఊహించని మెడికల్ ఎమర్జెన్సీ ఎదురై తీవ్ర కలకలం రేపింది.

ఉదయం నుంచే పానీపూరీ తినాలన్న తీవ్రమైన కోరికతో ఉన్న ఆ మహిళ, భర్త రావడం ఆలస్యం కావడంతో ఒంటరిగానే మార్కెట్‌కు వెళ్లింది. అక్కడ స్టాల్ వద్దకు వెళ్లి పెద్ద సైజులో ఉండే గోల్‌గప్పాలను ఇవ్వాలని వ్యాపారిని కోరింది. ఆపై పెద్ద పెద్ద పానీపూరీలను ఒకదాని తర్వాత ఒకటి గబగబా నోట్లో వేసుకుని లాగించేసింది.

సుమారు 10 పానీపూరీలు తిన్న తర్వాత, చివరగా మరో పెద్ద సైజు పానీపూరీని నోట్లో కుక్కుకోవడానికి ప్రయత్నించినప్పుడు అసలు సమస్య మొదలైంది. ఆ సమయంలో నోటిని ఒకేసారి అతిగా తెరవడంతో దవడ లాక్ అయిపోయింది. ఆ తర్వాత ఆమె ఎంత ప్రయత్నించినా నోరు మూతపడలేదు. తీవ్ర నొప్పితో విలవిల్లాడుతున్న ఆమెను చూసి చుట్టుపక్కల వారు షాక్ అయ్యారు. సమాచారం అందుకున్న భర్త హుటాహుటిన అక్కడికి చేరుకుని, ఆమెను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు.

వైద్యులు పరీక్షించగా, నోటిని విపరీతంగా తెరవడం వల్ల దవడ ఎముక కీలు తప్పినట్లు (Jaw Dislocation) గుర్తించారు. దవడను తిరిగి యథాస్థానానికి చేర్చేందుకు వైద్యులు ప్రయత్నించినప్పటికీ ప్రాథమికంగా అది కుదరలేదు. దీంతో ఆమెకు పెయిన్ కిల్లర్స్, ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక మెడికల్ కాలేజీ ఆసుపత్రికి రెఫర్ చేశారు.

పెద్ద సైజు ఆహార పదార్థాలను తినేటప్పుడు నోటిని మితిమీరి పెద్దగా తెరవడం వల్ల దవడ కీళ్లు జారిపోయే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పానీపూరీలపై ఉన్న అమితమైన ఇష్టంతో ఆసుపత్రి పాలైన ఈ మహిళ ఉదంతం ప్రస్తుతం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


Posted

in

by

Tags: