ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో మానవత్వాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేసే ఒక షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఫుడ్ డెలివరీ చేయడంలో కాస్త ఆలస్యం కావడం, ఫుడ్‌ను పై అంతస్తులోని ఫ్లాట్ వద్దకే వచ్చి ఇవ్వాలన్న వివాదం చివరకు తీవ్ర దాడికి దారితీసింది.
డెలివరీ బాయ్‌పై దారిలోనే దాడి చేయడమే కాకుండా, బలవంతంగా ఇంట్లోకి ఈడ్చుకెళ్లి అత్యంత పాశవికంగా చితకబాదిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణమంతా అక్కడి సీసీటీవీ (CCTV) కెమెరాలో రికార్డై ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
మీరట్‌లోని గంగాసాగర్ కాలనీ పరిధిలోని ‘గంగా హైట్స్’ అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా ఆర్డర్ చేసిన కస్టమర్‌కు ఆహారం అందించేందుకు డెలివరీ బాయ్ అక్కడికి చేరుకున్నాడు. ఫుడ్ తీసుకురావడం కాస్త ఆలస్యం కావడంతో, ఫోన్ కాల్‌లోనే డెలివరీ బాయ్ మరియు కస్టమర్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
డెలివరీ బాయ్ సదరు ఫ్లాట్ ముందుకు రాగానే, తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్న ఆ కస్టమర్ విచక్షణ మరిచి అతడిపై దాడికి దిగాడు. నెట్టింట వైరల్ అయిన దృశ్యాల్లో డెలివరీ బాయ్ రాగానే సదరు వ్యక్తి అతడిని నెట్టేసి పిడిగుద్దులు కురిపించడం స్పష్టంగా రికార్డయ్యింది.
ఈ ఘటనలో మరింత దారుణమైన విషయమేమిటంటే.. అరుపులు విని బయటకు వచ్చిన కస్టమర్ భార్య గొడవను ఆపాల్సింది పోయి, తన భర్తను మరింత రెచ్చగొట్టింది. “వాడిని లోపలికి లాక్కెళ్లు” అని ఆమె చెప్పడంతో, ఆ వ్యక్తి డెలివరీ బాయ్ జుట్టు పట్టుకుని బలవంతంగా ఫ్లాట్‌లోకి ఈడ్చుకెళ్లి బంధించి తీవ్రంగా కొట్టాడు.
ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన డెలివరీ బాయ్, తోటి ఉద్యోగులతో కలిసి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఘటనకు సంబంధించిన 3 నిమిషాల సీసీటీవీ ఫుటేజీని పోలీసులకు ఆధారంగా సమర్పించాడు.
ఫిర్యాదు స్వీకరించిన భావన్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఆధారంగా నిందితుడిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
