జీవితంలో అత్యంత కీలకమైన, గర్వించదగ్గ విజయాలను సాధించినప్పుడు మన పక్కన మనకు ఇష్టమైన వాళ్లు, కుటుంబ సభ్యులు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.
అలాంటి ఒక అద్భుతమైన రోజున, తన కుటుంబం నుంచి ఎవరూ రాకపోవడంతో కన్నీళ్లతో ఒంటరిగా నిలబడిన ఒక యువ సైనికుడిని.. అతని ఉన్నతాధికారి (కమాండర్) ఆత్మీయంగా హత్తుకుని ఓదార్చిన భావోద్వేగపూరిత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లను కంటతడి పెట్టిస్తోంది.
ఇండోనేషియాలో జరిగిన ఆర్మీ ట్రైనింగ్ పాసింగ్ ఔట్ పరేడ్ సందర్భంగా ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కఠినమైన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకుని వచ్చిన యువ సైనికులంతా తమ తల్లిదండ్రులు, తోబుట్టువులు, బంధువులను కౌగిలించుకుంటూ ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు.
అయితే ఆ గర్వించదగ్గ క్షణాల్లో ఒక యువ సైనికుడిని చూసేందుకు మాత్రం కుటుంబం నుంచి ఎవరూ రాలేకపోయారు. తోటి సైనికులంతా కుటుంబాలతో సంబరాలు చేసుకుంటుంటే, ఆ జవాన్ మాత్రం ఎవరైనా తన కోసం వస్తారేమోనన్న ఆశతో, దిగులుగా ఒక మూలన నిలబడి కన్నీళ్లు తుడుచుకుంటున్న దృశ్యం అందరి హృదయాలను కలచివేసింది.
ఆ జవాన్ ఒంటరిగా నిలబడి బాధపడటాన్ని గమనించిన ఆర్మీ కమాండర్, ఏమాత్రం ఆలోచించకుండా నేరుగా అతని వద్దకు నడిచి వెళ్లారు. దగ్గరకు వెళ్లి ఆ యువ సైనికుడిని ఆప్యాయంగా తన గుండెలకు హత్తుకున్నారు.
అప్పటివరకు బాధను దిగమింగుకున్న ఆ జవాన్, కమాండర్ కౌగిలిలో ఒదిగి చిన్నపిల్లాడిలా వెక్కివెక్కి ఏడ్చేశాడు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా, ఒక తండ్రిలా ఆ అధికారి ఇచ్చిన ఆత్మీయ కౌగిలి ఆ సైనికుడికి కొండంత మనోధైర్యాన్ని ఇచ్చింది.
ఈ వీడియో నెట్టింట వైరల్గా మారడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్లు తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు. “దిగులు పడకు సోదరా.. దేశం మొత్తం నీ కుటుంబమే”, “ఒక నిజమైన లీడర్ ఎలా ఉండాలో ఈ కమాండర్ చేసి చూపించారు” అంటూ ఆ అధికారి గొప్ప మనసును నెటిజన్లు వేనోళ్ల కొనియాడుతున్నారు.
