“వంతెనపై ఉధృతంగా వరద ప్రవాహం!” నీటిలో కొట్టుకుపోయిన పికప్ వ్యాన్… ప్రాణాల కోసం అల్లాడిన డ్రైవర్, క్లీనర్! 3 గంటల ఆపరేషన్ తర్వాత క్షేమంగా రెస్క్యూ!

ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

వరద ఉధృతితో ప్రజల సాధారణ జీవనం స్తంభించిపోగా, ఉధృతంగా ప్రవహిస్తున్న కాజ్‌వే దాటేందుకు ప్రయత్నించిన ఒక పికప్ వ్యాన్ వరద నీటిలో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో వాహనంలో ఉన్న డ్రైవర్ మరియు హెల్పర్ ప్రాణాల కోసం నడియేట్లో కొట్టుమిట్టాడిన దృశ్యాలు తీవ్ర కలకలం రేపాయి.

రాస్‌గోవింద్‌పూర్ పరిధిలోని సన్నై వంతెనపై దాదాపు 3 అడుగులకు పైగా వరద నీరు ప్రవహిస్తుండటంతో అధికారులు ఇప్పటికే ఆ మార్గంలో రాకపోకలను నిలిపివేశారు. అయితే ఆ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ పికప్ వాహనం డ్రైవర్ అమర్దా వైపు వెళ్లేందుకు వంతెన దాటే ప్రయత్నం చేశాడు.

వరద ప్రవాహం తీవ్రంగా ఉండటంతో అదుపుతప్పిన వ్యాన్ వంతెన పైనుంచి ప్రవాహంలోకి కొట్టుకుపోయి పూర్తిగా మునిగిపోయింది. వాహనం నుంచి అతికష్టంగా బయటపడిన డ్రైవర్, క్లీనర్ వరద నీటి మధ్యలో చిక్కుకుని సహాయం కోసం ఆర్తనాదాలు చేశారు.

సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో రెస్క్యూ ఆపరేషన్ తీవ్ర సవాలుగా మారింది. సుమారు 3 గంటల పాటు శ్రమించిన ఫైర్ సిబ్బంది.. బోట్ల సహాయంతో వారిద్దరినీ క్షేమంగా ఒడ్డుకు చేర్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వంతెనపై వరద ఉధృతి ఇంకా కొనసాగుతుండటంతో ఆ మార్గంలో రాకపోకలపై నిషేధం కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు.


Posted

in

by

Tags: