3 ఏళ్ల స్నేహాన్ని బలితీసుకున్న ఇన్‌స్టాగ్రామ్ రీల్స్! వీడియో చూస్తూ గేలి చేశాడని కక్ష… ప్రాణస్నేహితుడిని అతికిరాతకంగా పొడిచి చంపిన యువకుడు! తుమకూరులో దారుణం!

కర్ణాటకలోని తుమకూరు నగరంలో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ సరదాగా చేసిన వెటకారపు వ్యాఖ్యలు.. క్షణికావేశంలో నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. స్నేహితుడు తనను ఎగతాళి చేశాడన్న కోపంతో, 3 ఏళ్ల ప్రాణస్నేహాన్ని కూడా చూడకుండా ఓ యువకుడు తన మిత్రుడినే కత్తితో పొడిచి చంపిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

సుహైల్ (25), రప్పాన్ గత మూడేళ్లుగా ప్రాణస్నేహితులుగా ఉంటున్నారు. గత మంగళవారం రాత్రి సుహైల్, రప్పాన్ మరికొందరు స్నేహితులతో కలిసి ఓ షాపు దగ్గర కూర్చుని మొబైల్ ఫోన్లలో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ మాట్లాడుకుంటున్నారు.

ఆ సమయంలో ఓ రీల్ చూస్తూ సుహైల్.. రప్పాన్‌ను ఉద్దేశించి కొన్ని వెటకారపు వ్యాఖ్యలు చేశాడు. మొదట్లో సరిపెట్టుకున్నప్పటికీ, సుహైల్ పదే పదే తనను తక్కువ చేసి మాట్లాడటంతో రప్పాన్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి తీవ్ర ఘర్షణకు దారితీసింది.

కోపం నషాళానికి అంటిన రప్పాన్, తన వెంట తెచ్చుకున్న పదునైన కత్తిని తీసి సుహైల్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలిన సుహైల్‌ను అక్కడున్న వారు వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, మార్గమధ్యలోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు.

ప్రారంభంలో ఇది డబ్బుల విషయంలో జరిగిన హత్య అని ప్రచారం జరిగినప్పటికీ, తిలక్ పార్క్ పోలీసులు ప్రత్యక్ష సాక్షులైన ఇతర మిత్రులను విచారించడంతో రీల్స్ చూస్తూ చేసిన వెటకారమే ఈ హత్యకు దారితీసిందని తేలింది. హత్య అనంతరం పరారైన నిందితుడు రప్పాన్‌ను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకుని, కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.


Posted

in

by

Tags: