ఫిలిప్పీన్స్‌లోని పలావాన్ దీవి సమీపంలో ఉన్న ప్యూర్టో ప్రిన్సెస్ ప్రాంతంలో జరిగిన ఒక ఒళ్లు గగుర్పొడిచే ఘటన నెట్టింట తీవ్ర కలకలం రేపింది. చేపల వేటకు వెళ్లిన ఒక జాలరి ముఖాన్ని ఆక్టోపస్ తన ఎనిమిది కాళ్లతో గట్టిగా చుట్టేసి ఊపిరాడకుండా చేసిన భయానక దృశ్యాలు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాయి.
వివరాల్లోకి వెళితే.. జెస్సర్ సెర్వాంటెస్ అనే జాలరి తన చిన్న చెక్క పడవలో సముద్రంలో చేపల వేటకు వెళ్లాడు. వలలో పడిన ఒక పెద్ద ఆక్టోపస్‌ను పైకి తీస్తుండగా, అది ఒక్కసారిగా ఎగిరి నేరుగా అతని ముఖంపైకి దూకి అతుక్కుపోయింది.
ఆ ఎనిమిది కాళ్ల జలచరం తన బలమైన సక్కర్లతో (Suckers) అతని ముఖాన్ని గట్టిగా పట్టేసి, ముక్కు మరియు నోటిని పూర్తిగా మూసివేసింది. దీంతో ఊపిరాడక అల్లాడిపోయిన జెస్సర్.. దాన్ని ముఖం నుంచి వేరు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ ఆ ఆక్టోపస్ తన పట్టును మరింత బిగించింది తప్ప ఏమాత్రం వదల్లేదు.
ప్రాణాలు పోయే పరిస్థితి రావడంతో చివరకు పడవలో ఉన్న ఒక వెదురు కర్రను తీసుకుని ఆ ఆక్టోపస్‌పై గట్టిగా కొట్టడం ప్రారంభించాడు. కాసేపు సాగిన భీకర పోరాటం తర్వాత ఆక్టోపస్ పట్టు సడలించడంతో, అతికష్టమ్మీద దాన్ని ముఖం నుంచి తీసి తిరిగి సముద్రంలోకి విసిరేశాడు.
“వలలో చిక్కిన ఆక్టోపస్ ఊహించని విధంగా విరుచుకుపడింది. అది దాదాపు నా ముఖాన్ని పీకేసేంత ప్రమాదకరంగా మారింది” అని జెస్సర్ తన భయానక అనుభవాన్ని పంచుకున్నాడు. ఆక్టోపస్‌ల అసాధారణ బలం, జిగురు పట్టు మనుషుల ప్రాణాలకే ఎంతటి ముప్పు తెచ్చిపెడతాయో చెప్పడానికి ఈ ఘటనే ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది.
