2 సార్లు మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్… “నేను రాజకీయాల్లోకి రావడమే పెద్ద తప్పు!” స్వాతంత్ర్య దినోత్సవం వేళ పార్టీ ఆఫీసులోనే తృణమూల్ సీనియర్ నేత ఆత్మహత్య… లేఖలో సంచలన విషయాలు!

పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలో గల తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ కార్యాలయంలో, ఆ రాష్ట్ర మాజీ మంత్రి మరియు మాజీ డిప్యూటీ స్పీకర్ ఆశిష్ బెనర్జీ అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించడం తీవ్ర కలకలం రేపింది. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించిన పోలీసులు, ఘటనా స్థలంలో ఒక ఆత్మహత్య లేఖను (సూసైడ్ నోట్) స్వాధీనం చేసుకున్నారు.

రాంపూర్‌హాట్ నియోజకవర్గం నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆశిష్ బెనర్జీ.. గతంలో విద్యాశాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా మరియు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాంపూర్‌హాట్ పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఆయన, రోజంతా అక్కడే గడిపారు. అర్ధరాత్రి వరకు తన సోదరుడు, పార్టీ శ్రేణులతో సరదాగా మాట్లాడి నిద్రకు ఉపక్రమించిన ఆయన, మరుసటి రోజు ఉదయానికి విగతజీవిగా కనిపించారు.

ఆయన రాసిన లేఖలో.. “నా మరణానికి ఎవరూ బాధ్యులు కారు. తారాపీఠ్ రాంపూర్‌హాట్ డెవలప్‌మెంట్ అథారిటీ (TRDA) అవినీతి ఆరోపణల్లో నాపై అనవసరంగా నిందలు వేయడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాను. నా జీవితంలో ఏనాడూ ఒక్క పైసా కూడా లంచం తీసుకోలేదు. పార్టీలోని కొన్ని తప్పులను నేను అంగీకరించలేకపోయాను, అలాగని ఎదిరించనూ లేకపోయాను. అసలు రాజకీయాల్లోకి రావడమే నేను చేసిన పెద్ద తప్పు” అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది.

ఆయన ఆకస్మిక మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.


Posted

in

by

Tags: