కర్ణాటకలోని తుమకూరు జిల్లాకు చెందిన అవినాష్ (28), హాసన్ జిల్లాకు చెందిన ఒక యువతి కొన్నేళ్లుగా గాఢంగా ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించడంతో కేవలం ఆరు నెలల క్రితమే వీరి వివాహం ఘనంగా జరిగింది.
ఈ క్రమంలో సొంతూరి గ్రామ జాతర కోసమని పుట్టింటికి వెళ్లిన భార్య, పండుగ ముగిసి వారం దాటినా అత్తారింటికి తిరిగి రాలేదు. దీంతో ఫోన్ చేసి రమ్మని కోరినా సరైన సమాధానం రాకపోవడంతో.. అవినాష్ స్వయంగా వెళ్లి తనతో పాటు కాపురానికి రావాలని బ్రతిమిలాడాడు.
అయితే ఆ యువతి మాత్రం తనకు అతనితో కాపురం చేయడం ఇష్టం లేదని, ఇకపై కలిసి జీవించలేనని ముఖం మీదే తెగేసి చెప్పేసింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లాడిన భార్య ఒక్కసారిగా ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన అవినాష్.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
కొడుకు విగతజీవిగా వేలాడుతుండటం చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి కేసు నమోదు చేసుకున్నారు. పెళ్లయిన 6 నెలలకే భార్య కాపురానికి నిరాకరించడం వెనుక అసలు కారణాలేంటి అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
