సింగపూర్‌లోని ఒక రెస్టారెంట్‌లో చిన్నారి తలను ఆప్యాయంగా నిమిరిన 70 ఏళ్ల వృద్ధుడిపై ఒక వ్యక్తి ఆగ్రహంతో విరుచుకుపడి కిందకు నెట్టేసిన అమానుష ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహావేశాలను రేకెత్తిస్తున్నాయి.
సింగపూర్ ఈస్ట్ కోస్ట్ ప్రాంతంలోని ఒక కాఫీ షాప్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుడైన 70 ఏళ్ల వృద్ధుడు సరిగ్గా నడవలేని స్థితిలోనూ కుటుంబ పోషణ కోసం అక్కడి రెస్టారెంట్‌లో సహాయకుడిగా పనిచేస్తున్నాడు. ఘటన జరిగిన రోజున ఆయన టేబుళ్లను పట్టుకుంటూ నెమ్మదిగా నడుస్తూ, అక్కడ కూర్చున్న ఒక చిన్నారిని చూసి ముద్దుగా తలపై తట్టాడు.
వెంటనే అక్కడున్న మహిళ ఆయన చేతిని విదిలించగా, అక్కడే ఉన్న మరో వ్యక్తి ఆగ్రహంతో ఊగిపోతూ వచ్చి వృద్ధుడితో వాగ్వాదానికి దిగాడు. అంతటితో ఆగకుండా వృద్ధుడిని బలంగా వెనక్కి నెట్టడంతో, ఆయన బ్యాలెన్స్ తప్పి నేలపై తీవ్ర గాయాలతో పడిపోయాడు.
ఈ దారుణంపై బాధితుడి కుమారుడు సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేస్తూ న్యాయం చేయాలని కోరడంతో నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తమైంది. రంగంలోకి దిగిన సింగపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, వృద్ధుడిపై దాడికి పాల్పడిన వ్యక్తిపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు.
