మహారాష్ట్రలో సోషల్ మీడియాలో గుర్తింపు పొందిన రీల్స్ స్టార్స్ రౌడీల్లా మారి ఘర్షణకు దిగిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
డెక్కన్ పరిధిలోని ‘కేఫ్ ఫ్లయింగ్ జిప్సీ’లో, 19 ఏళ్ల సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అథర్వ జగ్తాప్‌పై ఓ ముఠా కత్తితో విచక్షణారహితంగా దాడి చేసింది. ఈ సంఘటనకు సంబంధించి ప్రముఖ రీల్స్ నటి మాధవి కుంభార్‌తో సహా ఏడుగురిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు.
దాడికి గురైన అథర్వ జగ్తాప్, అరెస్టయిన మాధవి కుంభార్ ఇద్దరూ సోషల్ మీడియాలో లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్న రీల్స్ ప్రముఖులే. కొద్ది నెలల క్రితం ఒక స్టంట్ వీడియో షూటింగ్ సమయంలో జరిగిన కారు ప్రమాదానికి సంబంధించి వీరిద్దరి మధ్య ఇప్పటికే విభేదాలు ఉన్నాయి. ఈ పాత కక్షల కారణంగానే ఈ దాడి జరిగినట్లు సమాచారం.
సంఘటన జరిగిన రోజు కేఫ్‌లో ఉన్న అథర్వను చూసిన మాధవి, ఆమె స్నేహితులు అతడితో వాగ్వాదానికి దిగారు. గొడవ పెద్దది కావడంతో అథర్వ తలపై, శరీరంపై కత్తితో తీవ్రంగా దాడి చేశారు. ఇన్‌స్టాగ్రామ్ లైకులు, కామెంట్లకు సంబంధించిన పోటీ కూడా ఈ వివాదానికి ప్రధాన కారణాలలో ఒకటిగా ప్రచారం జరుగుతోంది.
విద్యా కేంద్రంగా పేరుగాంచిన నగరంలో, యువత సోషల్ మీడియా పాపులారిటీని దుర్వినియోగం చేస్తూ హింసాత్మక మార్గాన్ని ఎంచుకోవడం ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రీల్స్ స్టార్లే ఇలా చేతుల్లోకి ఆయుధాలు తీసుకుని రౌడీయిజం మొదలుపెడితే సామాన్యుల భద్రత ఏమిటని సామాజిక కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అరెస్టయిన ఏడుగురిని అదుపులోకి తీసుకుని ముమ్మరంగా విచారిస్తున్నారు. నేరాలకు పాల్పడే వ్యక్తులు ప్రముఖులైనా సరే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని మహారాష్ట్ర పోలీసులు హెచ్చరించారు.
