హర్యానా రాష్ట్రంలోని పంచకుల పారిశ్రామిక వాడలో, పై అంతస్తుకు జనరేటర్‌ను ఎత్తే క్రమంలో అనుకోకుండా క్రేన్ బోల్తా పడటంతో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన చోటుచేసుకుంది.
పంచకుల ఇండస్ట్రియల్ ఏరియాలోని ఒక భవనం పైఅంతస్తుకు భారీ జనరేటర్‌ను తరలించేందుకు క్రేన్‌ను ఉపయోగించారు. ఆ సమయంలో క్రేన్ ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి పక్కకు బోల్తా పడింది. జనరేటర్‌తో పాటు పైభాగంలో పనులు చేస్తున్న ఇద్దరు కార్మికులు.. క్రేన్ పల్టీ కొట్టిన వేగానికి నాలుగో అంతస్తు పైనుంచి కింద పడిపోయారు. తీవ్ర గాయాలపాలైన వీరిద్దరూ ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు.
నియంత్రణ కోల్పోయిన క్రేన్ పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని కూడా బలంగా ఢీకొట్టింది. దాంతో ఆ స్తంభం విరిగి కిందపడటంతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు చెలరేగాయి. ఆర్తనాదాలు విన్న స్థానికులు పరుగున వచ్చి సహాయక చర్యలు చేపట్టే ప్రయత్నం చేశారు.
ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, మృతి చెందిన కార్మికుల వివరాలపై పోలీసులు కేసు నమోదు చేసి ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు.
