ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఆహ్లాదకరమైన ప్రకృతి అందాలను, చారిత్రక కట్టడాలను చూసి ఆనందించడం సహజం.
కానీ, చైనాలో ప్రస్తుతం యువత మరియు పర్యాటకులలో ‘డార్క్ టూరిజం’ (Dark Tourism) అనే వింతైన సరికొత్త ట్రెండ్ వేగంగా విస్తరిస్తోంది. సాధారణ పర్యాటకుల్లా కాకుండా విషాద సంఘటనలు, ప్రమాదకరమైన పరిస్థితులను స్వయంగా అనుభవించేందుకు సాహసించే ఈ విపరీత పోకడ తీవ్ర చర్చకు దారితీసింది.
దేశంలోనే తొలి కృత్రిమ విపత్తు కేంద్రం:
తూర్పు చైనాలోని హాంగ్జౌ నగరంలో దేశంలోనే మొట్టమొదటి అత్యాధునిక కృత్రిమ విపత్తు అనుభవ కేంద్రాన్ని ‘లుక్సింగ్ బేస్’ (Luxing Base) పేరిట ప్రారంభించారు. ప్రముఖ చైనీస్ సాహసికులు జాంగ్ జిన్యు, లియాంగ్ హాంగ్ స్థాపించిన ఈ కేంద్రానికి అనతికాలంలోనే యువత నుంచి విశేష ఆదరణ లభించింది.
గతంలో విపత్తులు సంభవించిన చారిత్రక ప్రాంతాలకు వెళ్లే బదులు.. ఆధునిక సాంకేతికతతో సృష్టించే భయంకరమైన ప్రకృతి వైపరీత్యాలను స్వయంగా ఎదుర్కొని, ఆ ఆపద నుంచి ఎలా ప్రాణాలు కాపాడుకోవాలో శిక్షణ పొందేందుకు చైనా యువత భారీ మొత్తంలో డబ్బులు చెల్లించి మరీ ఆసక్తి చూపుతున్నారు.
గంటకు 165 కి.మీ వేగంతో కృత్రిమ తుపాను:
ఈ కేంద్రంలో గంటకు 165 కిలోమీటర్ల వేగంతో వీచే కృత్రిమ తుపాను గాలులు, కుండపోత వర్షం మరియు ఆకస్మిక వరదలు వంటి ప్రమాదకర పరిస్థితులను నిజమైన వాతావరణంలాగే కళ్లకు కడతారు.
ఇక్కడికి వచ్చేవారు ప్రత్యేక రక్షణ దుస్తులు, హెల్మెట్లు ధరించి.. విపత్తుల నడుమ నిలబడి ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి, ఇతరులను ఎలా రక్షించాలి అనే మెళకువలను ప్రత్యక్షంగా నేర్చుకుంటారు.
