బెంగళూరు చిక్కబాణవర గుట్టే బసవేశ్వర నగర్ ప్రాంతంలో 34 ఏళ్ల అభినందన్ మరియు ఆయన 4 ఏళ్ల కుమారుడు యదువీర్ ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో విగతజీవులుగా పడి ఉండటం తీవ్ర కలకలం రేపింది.
సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనపై అభినందన్ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలో భార్య హరిణి వంటగదిలోని గరిటెతో అభినందన్‌పై దాడి చేసినట్లు ప్రాథమికంగా తెలిసింది.
ప్రియుడితో కలిసి దారుణం:
ఆ తర్వాత హరిణి తనకు అత్యంత సన్నిహితుడైన వినయ్ అనే వ్యక్తిని ఇంటికి పిలిపించి, అతడితో కలిసి అభినందన్‌పై తీవ్రంగా దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఆ సమయంలో నిద్రలేచిన 4 ఏళ్ల చిన్నారి యదువీర్‌ను కూడా ఊపిరాడకుండా చేసి కిరాతకంగా హతమార్చారు. అనంతరం ఇంట్లోని రక్తపు మరకలను శుభ్రం చేసి, ఆధారాలు దొరక్కుండా సీసీటీవీ (CCTV) కెమెరాలను డిసేబుల్ (నిలిపివేత) చేసినట్లు సమాచారం. ప్రస్తుతం పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు వినయ్‌ను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
