ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మహోబా ప్రాంతంలో వరకట్న వేధింపులకు సంబంధించి తీవ్ర దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది.
పెళ్లయిన కొద్ది నెలలకే అదనపు కట్నం కోసం భర్త, అతని కుటుంబ సభ్యులు తనను తీవ్రంగా వేధించారని 7 నెలల గర్భిణి నస్రీన్ ఖాతూన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రూ.10 లక్షల నగదు, బంగారు గొలుసు కావాలని వేధింపులకు గురిచేశారని ఆమె ఆరోపించింది. అంతేకాకుండా తనపై భౌతిక దాడి చేసి, అనంతరం భర్త మూడుసార్లు ‘తలాక్’ చెప్పి ఇంటి నుంచి గెంటేశాడని ఆమె వాపోయింది.
నస్రీన్ ఖాతూన్, అబ్దుల్ ఖాదిర్‌లకు 2025 అక్టోబర్ 14న వివాహం జరిగింది. వివాహ సమయంలో తమ స్తోమతకు తగ్గట్టుగా కట్నకానుకలు, లాంఛనాలు సమర్పించినట్లు నస్రీన్ కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే పెళ్లయిన కొద్ది రోజుల నుంచే అదనపు కట్నం కోసం వేధింపులు మొదలైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
భర్త అబ్దుల్ ఖాదిర్, అత్త నస్రా, మామ అబ్దుల్ వాహిద్‌లు రూ.10 లక్షల నగదు, బంగారు గొలుసు తీసుకురావాలని తీవ్ర ఒత్తిడి తెచ్చారని నస్రీన్ ఆరోపించింది. ఈ డిమాండ్‌ను తీర్చలేకపోవడంతో తనను తరచూ చిత్రహింసలకు గురిచేసేవారని ఆమె పేర్కొంది. తాను 7 నెలల గర్భిణిగా ఉన్నప్పటికీ జుట్టు పట్టుకుని విచక్షణారహితంగా దాడి చేశారని తెలిపింది. సమాచారం అందుకుని నస్రీన్ తండ్రి, సోదరుడు అక్కడికి వెళ్లగా వారిపైనా గొడవపడి దాడి చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు.
గాయపడిన నస్రీన్‌ను కుటుంబ సభ్యులు జిల్లా మహిళా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెకు చికిత్స, వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. భర్త తనకు మూడుసార్లు తలాక్ చెప్పి ఇంటి నుంచి వెళ్లగొట్టాడని నస్రీన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తన భర్త, అత్త, మామలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
