“22 ఏళ్లుగా భరించింది చాలు..!” కన్నతల్లిని కాపాడుకోవడానికి కుమారుడు చేసిన పని.. తాగుబోతు భర్తను కొట్టి చంపిన పెంపుడు కొడుకు అరెస్ట్..!!!

బెంగళూరులో మద్యం మత్తులో తల్లిపై కత్తెరతో దాడి చేయబోయిన సవతి తండ్రిని, 23 ఏళ్ల యువకుడు ఇనుప రాడ్‌తో కొట్టి చంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

మృతుడిని జర్నలిస్టుగా పనిచేస్తున్న శ్రీధర్‌గా గుర్తించారు. ఆయనను హత్య చేసిన నేరానికి గాను పెంపుడు కుమారుడైన ఉదయ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

హత్యకు గురైన శ్రీధర్‌కు తీవ్రమైన మద్యపానం అలవాటు ఉంది. రోజూ మద్యం తాగి ఇంటికి వచ్చి భార్య దీనాతో తరచూ గొడవపడటం, ఆమెను కొట్టి వేధించడం పరిపాటిగా మారినట్లు తెలుస్తోంది. దీంతో ఆ ఇంట్లో నిత్యం గొడవలు జరుగుతుండేవి.

ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఎప్పటిలాగే మద్యం తాగి వచ్చిన శ్రీధర్, కత్తెర తీసుకుని భార్య దీనాపై దాడికి యత్నించాడు. దీన్ని చూసి తీవ్ర ఆగ్రహానికి, భయానికి గురైన కుమారుడు ఉదయ్.. తన తల్లిని కాపాడుకోవడానికి వెంటనే అడ్డువచ్చాడు. ఆ సమయంలో పక్కనే ఉన్న బైక్ షాక్ అబ్జార్బర్ ఇనుప రాడ్‌ను తీసుకుని శ్రీధర్ తలపై మూడుసార్లు బలంగా కొట్టాడు.

ఈ దాడిలో తీవ్ర గాయాలపాలై రక్తపు మడుగులో కుప్పకూలిన శ్రీధర్‌ను కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు విడిచారు. అనంతరం శ్రీధర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విక్టోరియా ఆసుపత్రికి తరలించారు.

దీనాకు మొదటి వివాహం ద్వారా జన్మించిన కుమారుడే ఉదయ్. మొదటి భర్తతో విడిపోయిన తర్వాత, 22 సంవత్సరాల క్రితం దీనా శ్రీధర్‌ను రెండో వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఈ హత్య ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, అరెస్టయిన ఉదయ్‌ను ముమ్మరంగా విచారిస్తున్నారు.


Posted

in

by

Tags: