కర్ణాటక రాష్ట్రానికి చెందిన మహిళా పోలీసు అధికారి ఆర్. జయశ్రీపై వచ్చిన ఒక తీవ్రమైన ఆరోపణ ప్రస్తుతం పెను సంచలనం సృష్టిస్తోంది.
గతంలో బెంగళూరులోని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో పనిచేసిన ఈమె, బెలగావి (బెల్గాం) సెంట్రల్ జైలు ఖైదీలతో అక్రమ సంబంధాలు, పరిచయాలు కొనసాగించారనే వ్యవహారంపై కర్ణాటక లోకాయుక్తలో అధికారికంగా ఫిర్యాదు నమోదైంది.
బెలగావి జైలులో పనిచేసిన సమయంలో.. ఖైదీలకు జైలు లోపల ప్రత్యేక సదుపాయాలు కల్పించడం, నిబంధనలకు విరుద్ధంగా బయటి నుంచి ఆహారం తెప్పించి ఇవ్వడం, కుటుంబ సభ్యులను సులభంగా కలిసేలా చేయడం వంటి అనేక అవకతవకలకు ఈ అధికారి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ అక్రమాలకు బదులుగా ఖైదీల నుంచి భారీ మొత్తంలో లంచాలు వసూలు చేసినట్లు కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు.
అంతేకాకుండా, జైలులో ఉన్న ఒక ఖైదీతో వీడియో కాల్ మాట్లాడుతూ, సదరు అధికారి తన పోలీస్ యూనిఫాం తీసేసి అసభ్యకరంగా ప్రవర్తించినట్లు చెబుతున్న వీడియో క్లిప్పింగ్ ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ వ్యవహారంపై లోకాయుక్త విభాగానికి లిఖితపూర్వక ఫిర్యాదు అందగా, ఈ దారుణ ఘటన తీవ్ర దుమారం రేపిన నేపథ్యంలో అధికారులు సమగ్ర విచారణను ప్రారంభించారు.
