కుటుంబాన్ని పోషించడం కోసం పరాయి ఊరిలో రెక్కలు ముక్కలు చేసుకుంటున్న భర్తకు దక్కిన షాకింగ్ బహుమతి, ఆ తర్వాత అతడు తీసుకున్న ఊహించని నిర్ణయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీ జిల్లాకు చెందిన జీవ్నాథ్ రాజ్‌భర్‌కు, సరిత అనే మహిళతో వివాహమైంది. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబ పేదరికాన్ని పోగొట్టేందుకు జీవ్నాథ్ ఢిల్లీలో ఉంటూ వెల్డింగ్ పనులు చేసేవాడు. భార్య సరిత పిల్లలతో కలిసి స్వగ్రామంలోనే ఉంటోంది.
భర్త దూరంగా ఉండటాన్ని ఆసరాగా చేసుకున్న 45 ఏళ్ల సరితకు, రైళ్లలో బఠానీలు అమ్ముకునే 25 ఏళ్ల అజయ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో తన ముగ్గురు పిల్లలను, భర్తను వదిలేసి ప్రియుడు అజయ్‌తో కలిసి సరిత ఇంట్లో నుంచి పారిపోయింది.
విషయం తెలుసుకుని ఆందోళనతో ఊరికి వచ్చిన జీవ్నాథ్, భార్య కోసం పలుచోట్ల గాలించాడు. చివరకు గత వారం ఓ రైల్వే స్టేషన్లో సరిత, ఆమె ప్రియుడు అజయ్‌లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. “జరిగినదంతా మర్చిపోయి నాతో ఇంటికి వచ్చెయ్” అని భార్య కాళ్లు పట్టుకోనంత పనిచేసి వేడుకున్నాడు భర్త. కానీ సరిత ఏమాత్రం కనికరం లేకుండా, “ఇకపై నా జీవితాంతం అజయ్‌తోనే ఉంటాను” అని ఖరాఖండీగా తేల్చి చెప్పేసింది.
భార్య తనతో రావడానికి ససేమిరా ఒప్పుకోకపోవడంతో జీవ్నాథ్ ఒక నిర్ణయానికి వచ్చాడు. సరిత కోరుకున్నట్లే ఆమెకు నచ్చిన జీవితాన్ని ఇచ్చేయాలని భావించాడు. వెంటనే వారిద్దరినీ రిజిస్ట్రార్ ఆఫీస్‌కు తీసుకెళ్లి, తన చేతుల మీదుగానే భార్యకు ఆ యువకుడితో వివాహం జరిపించాడు.
దీనిపై జీవ్నాథ్ మాట్లాడుతూ.. “నేను నా భార్యతో కలిసి సంతోషంగా జీవించాలనే అనుకున్నాను. కానీ ఆమెకు నాతో ఉండటం ఇష్టం లేదు. అందుకే ఆమె సంతోషం కోసం నా వల్ల అయింది చేశాను” అని ఆవేదన వ్యక్తం చేశాడు.
మరోవైపు, తన కాపురం కూలిపోవడానికి భర్త జీవ్నాథే కారణమంటూ సరిత ఎదురుదాడికి దిగింది. సంసార ఖర్చులకు అతను సరిగ్గా డబ్బులు పంపేవాడు కాదని, తమ మధ్య నిత్యం గొడవలు జరిగేవని ఆమె ఆరోపించింది. ఏది ఏమైనా, భార్యను ఆమె ప్రియుడికే ఇచ్చి స్వయంగా పెళ్లి చేసిన ఆ భర్త ఉదంతం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
